మహారాష్ట్రలోని మున్సిపల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

by John Kora |
మహారాష్ట్రలోని మున్సిపల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
X

- బుల్డోజర్ ఉపయోగించడంపై మండిపాటు

- ఎస్సీ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపణ

దిశ, నేషనల్ బ్యూరో: భారత వ్యతిరేక ఆరోపణలు చేశాడనే ఆరోపణపై స్క్రాప్ వ్యాపారి దుకాణం కూల్చి వేసిన ఘటనలో మహారాష్ట్రలోని మాల్వాన్ మున్సిపల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర సింధూదుర్గ్ జిల్లాలో గత నెల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత కితాబుల్లా హమీదుల్లా ఖాన్ (38) అనే వ్యాపారి, ఆయన కుటుంబం ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాల్వాన్‌ మున్సిపల్ అధికారులు అనధికారికంగా నిర్మాణం చేపట్టారనే కారణంతో ఖాన్ దుకాణాన్ని కూల్చి వేశారు. ముందస్తు హెచ్చరిక, నోటీసు ఇవ్వకుండా ముస్లిం వ్యక్తి ఇల్లు, దుకాణాన్ని కూల్చి వేశారని ఈ బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి.. సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. మాల్వన్ మున్సిపల్ కౌన్సిల్ ముఖ్య అధికారి, అడ్మినిస్ట్రేటర్ సంతోశ్ జిరాజ్ వెంటనే ఈ అంశంలో తన స్పందన తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. కూల్చి వేత చట్టపరమైన విధానాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లింఘించడంపై ఖాన్ పేర్కొన్న అంశాలను అత్యున్నత న్యాయ స్థానం పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి 23న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత స్థానికులు ఖాన్ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అవుటైన తర్వాత ఖాన్, అతని భార్య ఆయేశా (35), 15 ఏళ్ల కుమారుడు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నీలేశ్ రాణే నేతృత్వంలో బైక్ ర్యాలీ జరిగిన తర్వాత.. ఆయన ఖాన్ నివాసాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మున్సిపల్ కౌన్సిల్ దుకాణాన్ని కూల్చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు.

తాను చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరుడినని ఖాన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 23న మసీదు నుంచి తిరిగి వస్తున్న తన మైనర్ కొడుకు పేరు అడిగి, అతడిని కొంత మంది కొట్టారని ఖాన్ తెలిపారు. ఆ తర్వాత ఆ గుంపులోని ఒక వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించి తనను దుర్భాషలాడారని చెప్పాడు. గతంలో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది.

Next Story

Most Viewed