డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by Aamani |
డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
X

దిశ, హనుమకొండ : మణికొండ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల సుమారు పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాసనసభలో ప్రస్తావించారు. సాయంత్రం సమయంలో డంపింగ్ యార్డు నుంచి వెలువడే పొగ వల్ల ప్రజలు ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొందని వివరించారు. గతంలో వరంగల్, కరీంనగర్, హుజురాబాద్, పరకాల పట్టణాలకు ఉపయోగపడే విధంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని అధికారులకు సూచించారాని అన్నారు. కానీ ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్ తరలింపు విషయంలో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రయత్నించినా ఫలితం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి ని కలిసి డంపింగ్ యార్డ్ సమస్యను వివరించినట్లు తెలిపారు. వరంగల్ నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సంబంధిత శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.

Next Story