ఆ 'ఎక్స్' ఖాతాలపై చర్యలు తీసుకోండి.. డీసీపీకి టీపీసీసీ సోషల్ మీడియా ఫిర్యాదు

by Ramesh Goud |
ఆ ఎక్స్ ఖాతాలపై చర్యలు తీసుకోండి.. డీసీపీకి టీపీసీసీ సోషల్ మీడియా ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సోషల్ మీడియా టీం (TPCC Social Media Team) మాదాపూర్ డీసీపీ (DCP, Madhapur)కి ఫిర్యాదు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం (Kanche Gachibouli Land Dispute) రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభివృద్ధి పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూములను వేలం వేస్తోందని, అవి ముమ్మాటికీ హెచ్‌సీయూకి చెందిన భూములేనని, ప్రభుత్వ భూములు కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను వేలం వేయకుండా ఎలాగైనా కాపాడుకుంటామని, విద్యార్థులకు అండగా ఉంటామని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా ఫైర్ అయ్యింది.

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, దీని ద్వారా ప్రజలను తప్పుదొవ పట్టించాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సోషల్ మీడియా, టీజీటీఎస్ చైర్మన్ మన్నె సతీష్ (Manne Sathish), క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ (Deepak jan) సహా ఇతర నేతలు మాదాపూర్ డీసీపీని కలిశారు. ఈ సందర్భంగా వారు.. కంచె గచ్చిబౌలి ప్రాంతంలో కొనసాగుతున్న భూ సేకరణకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని 'X' హ్యాండిల్స్‌ నకిలీ, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకొని, తప్పుడు సమాచారాన్ని వ్యాపించకుండా అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ.. టీపీసీసీ సోషల్ మీడియా టీంకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.



Next Story

Most Viewed