నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపు చేయాలి : వేములవాడ ఎమ్మెల్యే

by Aamani |
నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపు చేయాలి : వేములవాడ ఎమ్మెల్యే
X

దిశ,వేములవాడ : వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం అవసరమని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమీపంలో అందుబాటులో ఉండేందుకు ఇవన్నీ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరారు.

వేములవాడ పట్టణంలో మోడల్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయ సముదాయం, ఇతర పోలీస్ స్టేషన్ల అధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, మహిళ భద్రతను పెంపొందించేందుకు వేములవాడ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని అన్నారు. వేములవాడ అర్బన్ మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని, రుద్రంగి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ, మరమ్మతులు చేపట్టాలని సూచించిన ఆయన, మోహన్ రావు పేట నుంచి ఈదుల లింగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, తండ్రి యాల నుండి పసునూరు మీదుగా కొత్త రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు రహదారుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

Next Story