వడగళ్ల వానకు పంట నష్ట పరిహారం చెల్లిస్తాం : మంత్రి తుమ్మల

by M.Rajitha |
వడగళ్ల వానకు పంట నష్ట పరిహారం చెల్లిస్తాం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈనెల 21 నుండి 23 వరకు కురిసిన వడగళ్ల వానలకు జరిగిన పంటనష్టంపై ప్రాథమిక నివేదిక అందినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతు వారీ సర్వే చేసి తుది నివేదిక రూపొందించాల్సిందిగా వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో 64 మండలాలలో 11,298 ఎకరాలలో నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. దెబ్బతిన్న పంటల్లో 6670 ఎకరాలలో వరి, 4100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి ఇతర పంటలు ఉన్నట్లు వెల్లడించారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వచ్చి పంట పొలాలను పూర్తిగా పరిశీలన చేయాలని, నామమాత్రం సర్వే చేయవద్దని రైతులు సూచిస్తున్నారు.

గతేడాదిలో వానాకాలంలో జరిగిన పంట నష్టానికి క్షేత్ర స్ధాయిలో సక్రమంగా సర్వే చేయకుండా పైరవీలు చేసిన వారికే పరిహారం అందినట్లు, ఈసారి పంట నష్టపోయిన నిజమైన రైతులకు ఇవ్వాలని కోరుతున్నారు. అదే విధంగా పంట నష్టం జరిగిన దాంట్లో 33 శాతం కాకుండా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని, పరిహారం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్​చేశారు. మొన్నటివరకు భూగర్భ జలాల అందక పంటలు ఎండి పోయిన రైతులు ఆవేదనలో ఉండగా, తాజాగా ఆకాల వర్షాలకు చేతికి వచ్చి పంట దెబ్బతినడంతో అన్నదాతలపై అప్పల భారం పెరిగిపోతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సాయం కింద భరోసా పథకం పూర్తిగా అమలు చేసి పంట వేసిన రైతులకు రూ. 6వేలు ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు.



Next Story