- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ అభివృద్ధికి నిధులేవీ..? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. హైదరాబాద్ అభివృద్ధికి నిధులేవని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో వివేకానంద మాట్లాడారు. గత బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు కేటాయించినా రూ.1,200 కోట్లే విడుదల చేశారని చెప్పారు. అదేవిధంగా హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు పైసా ఇవ్వలేదని, జలమండలికి రూ.3,385 కోట్లు కేటాయిస్తే.. రుణాలకే రూ.800 కోట్లు ఇచ్చారని అన్నారు. మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం-ఎయిర్ పోర్ట్ మార్గాన్ని ప్రభుత్వం ఇప్పటికే రద్దుచేసిందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.
మెట్రోకు రూ.1,100 కోట్లు కేటాయిస్తే.. రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించినా కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. గతేడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25 శాతమే విడుదల చేశారని చెప్పారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో ఊహల నగరంలో విహరిస్తూ ఉన్న నగరమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీకి రూ.7,582 కోట్లు అడిగితే.. రూ.3,100 కోట్లే కేటాయించారన్నారు. జలమండలికి ఇప్పటికే రూ.1500 కోట్లు అప్పులున్నాయని తెలిపారు. ఉమ్మడి పాలనలో జలమండలి ముందు నీళ్ల కోసం ధర్నాలు జరిగేవని, కేసీఆర్ హయాంలో అందరికీ సరిపడా నీళ్లందించారని చెప్పారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడినా ట్యాంకర్లు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. సాగర్ నుంచి 270 ఎంఎల్డీ కృష్ణా నీళ్లు హైదరాబాద్ వస్తున్నాయని, రూ.800 కోట్లు ఖర్చు చేస్తే కోదండాపూర్ నుంచి నీళ్లు తేవొచ్చని సూచించారు. హెచ్ఎండీఏని భూములు అమ్ముకోవాలని ప్రభుత్వం చెబుతున్నదని, కానీ హైడ్రా వల్ల భూములు కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల పనులు ఏడాదైనా అతీగతీలేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 40 శాతం వీధిలైట్లు వెలగడం లేదని వివరించారు. నో ఎల్ఆర్ఎస్.. నో బిఆర్ఎస్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ మాటను నిలబెట్టుకోవాలన్నారు.
ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా-ఈ రద్దు, రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు అంటూ అన్ని రద్దు చేసుకుంటూ పోతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని నిలదీశారు. తెలంగాణ రైజింగ్ అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ విషయం పక్కన పెడితే తెలంగాణ స్థాయి పడిపోకుండా చూస్తే చాలని అన్నారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ వచ్చిందని, సుంకిశాల పూర్తయితే సాగర్‌లో డెడ్ స్టోరేజ్ సమస్య ఉండదని అన్నారు. మెగా కంపెనీ నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిందని, మెగా కంపెనీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదని అన్నారు. డెడ్‌స్టోరేజీ నుంచి తరలించే మోటార్ల ఖర్చు మెగా కంపెనీ భరించాలన్నారు. రాబోయే వేసవిలో నీటి అవసరాలపై జలమండలికి వేసవి కార్యాచరణ ఏదని నిలదీశారు.