Fadnavis: అలాంటి హాస్యాన్ని అనుమతించబోము.. కునాల్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఫైర్

by vinod kumar |
Fadnavis: అలాంటి హాస్యాన్ని అనుమతించబోము.. కునాల్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే (Eknath shinde) పై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా (Kunal kamra) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ఓ హోటల్ లో నిర్వహించిన షోలో భాగంగా కమ్రా షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన ప్రదర్శనలో భాగంగా షిండేను దేశ ద్రోహిగా అభివర్ణించారు. 2022లో ఉద్ధవ్ థాక్రేపై షిండే తిరుగుబాటును ప్రస్తావిస్తూ.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్రాపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. షో జరిగిన హోటల్‌పై దాడి చేసి స్టూడియోను ధ్వంసం చేశారు. కమ్రా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కొద్ది గంటల్లోనే వారికి బెయిల్ మంజూరైంది.

కునాల్‌పై ఎఫ్‌ఐఆర్‌

శివసేన నేతల ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో కమ్రా స్పందించారు. నేను పాడిన పాటపై ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడటం లేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని చట్టానికి లోబడి నడుచుకుంటామని తెలిపారు. కోర్టు చెబితే మాత్రమే సారీ చెబుతానని తేల్చి చెప్పారు. షిండేను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షాలు తనకు డబ్బు ఇచ్చాయనే పుకార్లను కమ్రా ఖండించారు. అవసరమైతే తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా అందజేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందిస్తూ.. కునాల్ కాల్ రికార్డింగ్స్, ఆయన బ్యాంకు స్టేట్ మెంట్లపై దర్యాప్తు చేపడతామని, దీని వెనుక ఎవరున్నారో తేల్చుతామని చెప్పారు.

హోటల్ అక్రమ నిర్మాణమన్న అధికారులు

కమ్రా వ్యాఖ్యలపై ఆందోళనలు కొనసాగుతుండగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కమ్రా షో చేసిన హోటల్ అక్రమ నిర్మాణమని తెలిపారు. ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నైక్‌ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో వెంటనే స్టూడియో వద్దకు చేరుకున్న అధికారులు కొంత భాగాన్ని కూల్చేశారు. యజమాని కొన్ని అక్రమ షెడ్లను నిర్మించారని చెప్పారు. వాటిని తొలగించామని.. దానికి నోటీసులతో పనిలేదని తెలిపారు. స్టూడియో ప్లాన్‌ను సైతం పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

క్షమాపణలు చెప్పాల్సిందే

కమ్రా వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. కామెడీ చేయడానికి స్వేచ్ఛ ఉందని, కానీ దానికి పరిమితులు ఉంటాయని తెలిపారు. కునాల్ వెంటనే సారీ చెప్పాలని ఈ తరహా కామెడీని సహించబోమని హెచ్చరించారు. షిండేను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు తమకు ఓటు వేసి గెలిపించారని, దేశ ద్రోహులను ఇంటికి పంపించారని విమర్శించారు. అవమానకరమైన ప్రకటనలు చేయడం ఆమోదయోగ్యం కాదని, దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛగా చూడలేమన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ ఉల్లంఘించకూడదని తెలిపారు.

Next Story

Most Viewed