ఉమ్మడి రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తప్పాదా..?

by Sathputhe Rajesh |
ఉమ్మడి రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తప్పాదా..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీలో నేతల మద్య వర్గపోరు రోజు రోజుకు బహిర్గతమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల్లో ఎన్నికల హాడావుడి కనిపిస్తోంది. అయితే నేతలు తమ అనుచరులను ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలపై అప్రమత్తం చేస్తూ పైచేయి సాధించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో నేతల మధ్య సమన్వయం లేదని, టికెట్ దక్కించుకోవాలంటే తమ అధిపత్యం అధిష్టానానికి తెలియాలని ఒకరు, పార్టీ పద్దతి ప్రకారం విధేయుడిగా ఉంటూ మరోకరు మౌనం వహిస్తున్నారు.

ఇలా జిల్లాలోని బీఆర్‌ఎస్​నేతలు ఎవరికివారే ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ అధికార పార్టీ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. కానీ టికెట్ దక్కుతుందా లేదా అనే డైలామాలో ఉన్న మాట వాస్తవం. బీఆర్‌ఎస్​ అధినేత సిట్టింగ్‌లకే టికెట్ అంటూ సంకేతం ఇస్తున్నారు. అదే పార్టీలో మరో మంత్రి మాత్రం 25 మందికి కొత్తవారికి అవకాశం ఇస్తే తప్పా బీఆర్ఎస్​అధికారంలోకి రాదనే ప్రచారం చేస్తున్నారు. ఆ మంత్రి మాట్లాడిన మాట వాస్తవమేనా... అదే వాస్తవమైతే మాకు టికెట్ తప్పకుండా వస్తుందనే ధీమాలో ఆశావాహులు ఎవరికి వారే అపాదించుకుంటున్నారు.

అదే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టికెట్​ఆశించే బీఆర్ఎస్​ నాయకుల ఆలోచనలో గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో తాండూర్​నియోజకవర్గంపైనే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పట్నం మహేందర్​రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగి ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధియైన యువ నాయకుడి చేతిలో ఓడిపోయారు. ఆ ఓడిపోయిన నేత బీఆర్ఎస్‌లో చేరిననాటి నుంచి హాట్​టాపిక్‌గానే నిలిచిపోయింది. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినప్పటికి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని పట్నం మహేందర్​రెడ్డి పట్టుబట్టడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నేతకే టికెట్ దక్కితే పట్నం మహేందర్​రెడ్డి పార్టీ మారకతప్పదనే ప్రచారం లేకపోలేదు. అదే ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్​దక్కకపోతే పార్టీ మారే అవకాశం లేదనే సంకేతాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేపై పార్టీ అధినేత ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కానీ మహేందర్​ రెడ్డి టికెట్ దక్కుతుందనే ఆశతోనే ఇంకా పార్టీలో కొనసాగుతున్నప్పటికి భవిష్యత్తులో పార్టీకి భారీ షాక్​ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉమ్మడి జిల్లాను శాసించిన వ్యక్తి... కనుక ఇతర పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

మహేశ్వరంలోని తీగల కృష్ణారెడ్డి, షాద్​నగర్‌లోని ప్రతాప్​ రెడ్డి, ఇబ్రహీంపట్నంలోని క్యామ మల్లేశం, చేవెళ్లలోని కే.ఎస్​రత్నం, వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ వైస్​ చైర్మన్, పరిగిలోని మనోహార్​రెడ్డి, కొడంగల్‌లోని గురునాథ్​రెడ్డి, ఎల్బీనగర్‌లోని ముద్దగౌని రామోహన్​గౌడ్​, కల్వకుర్తిలోని ఓ నాయకుడు బీఆర్‌ఎస్​టికెట్ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరూ పట్నం మహేందర్​ రెడ్డి బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వీరిలో ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న నేతలున్నారు.

రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు బలోపేతం చేసేందుకు టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ వెంట నడిచిన వాళ్లున్నారు. ఆశపడటంలో తప్పులేదు కానీ అవమానాలు ఎదుర్కోని ఉంటామని ఏ నేత అనుకోరు. కానీ ఇప్పుడు క్షేత్రస్ధాయిలో పార్టీపై వ్యతిరేకత కనిపిస్తున్న దృష్ట్యా అవకాశం లేకపోతే పార్టీ మరుతారని ప్రచారం జోరందుకుంది. వీరందరూ ఇప్పటికే ఆయా నియోజకవర్గంలోని కాంగ్రెస్​, బీజేపీల్లోని కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్​తప్పదని తెలుస్తోంది.

Advertisement

Next Story