గ్రూప్-1 గందరగోళంలో తప్పు అధికారులదేనా..?

by karthikeya |   ( Updated:2024-10-22 02:30:45.0  )
గ్రూప్-1 గందరగోళంలో తప్పు అధికారులదేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు జీవో 29ను అర్థమయ్యేలా వివరించడంలో ఐఏఎస్ అధికారులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం తలెత్తదని ఆధారాలతో సహా వివరించి ఉంటే.. వివాదానికి ఫుల్‌స్టాప్ పడేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంలో అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలిసింది. జీవో వివాదం మొదలైన తర్వాత జీఏడీ నుంచి వివరణ రాలేదు. అలాగే అడ్మినిస్ట్రేషన్ హెడ్‌గా ఉన్న సీఎస్ సైతం మౌనంగా ఉన్నారని మంత్రులు తమ ఇంటర్నల్ మీటింగ్స్‌లో కామెంట్ చేశారని టాక్. ‘చాలా సార్లు ఆఫీసర్ల తీరు వల్లే సమస్యలు వస్తున్నాయి. జీవో 29 వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎస్ ప్రకటన విడుదల చేయాల్సి ఉండే. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించి ఉండాల్సింది. కానీ ఆ పనిచేయకపోవడం వల్ల వివాదం మరింత ముదిరింది.’ అని ఓ సీనియర్ మంత్రి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. జీవో విడుదల చేసిన జీఏడీ అధికారులు, ఇటు సీఎస్ సైతం దీనిపై మౌనంగా ఉండటంతోనే రాజకీయ దుమారం పెరిగిందనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది. నిజానికి జీవో‌లో సాంకేతిక అంశాలపై వివాదాలు, అనుమానాలు తలెత్తినప్పుడు లీడర్ల ప్రకటనలు కన్నా అధికారుల వివరణల వల్లే సమస్యకు పరిష్కారం లభించిన సందర్భాలు చాలా ఉన్నాయని సీనియర్ ఐఏఎస్‌లు గుర్తు చేస్తున్నారు.

సైలెంట్‌గానే జీఏడీ అధికారులు

రాజ్యాంగం ప్రకారం సర్వీస్ కమిషన్ తీసుకునే కీలక నిర్ణయాలను నేరుగా గవర్నర్‌కు రిపోర్టు చేస్తుంది. కానీ కమిషన్ చేపట్టే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వంలోని జీఎడీ విభాగం సపోర్టు చేస్తుంది. ఉద్యోగాల ఖాళీల వివరాలు మొదలు రిజర్వేషన్లు వరకు ప్రతి అంశాన్నీ జీఏడీ ఇచ్చే జీవోల అధారంగానే కమిషన్ తన కార్యకాలాపాలను కొనసాగిస్తుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జీఏడీనే జీవో 29ను విడుదల చేసింది. కానీ దీనిపై అభ్యర్థులకు అనుమానాలు వ్యక్తం కావడంతో వాటిని నివృత్తి చేయకుండా జీఏడీ అధికారులు సైతం సైలెంట్ గానే ఉండిపోయారు.

మెయిన్స్ లిస్టును ప్రకటిస్తే బాగుండేది

గతంలో జీవో 55 ప్రకారం మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల కొన్ని రిజర్వ్ కేటగిరీల్లో అభ్యర్థులు దొరక్కపోవడంతో కొన్ని పోస్టుల బ్యాక్‌లాగ్ అయ్యేవి. అలాంటి సమస్య రావొద్దని ఉద్దేశ్యంతో జీవో 29 విడుదల చేసి, మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. కానీ ఈ జీవో వల్ల తమకు నష్టం వాటిల్లుతుందనే అందోళన రిజర్వ్ అభ్యర్థులను వెంటాడుతున్నది. వెంటనే అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు మెయిన్స్ ఎంపికైన వారి వివరాలు(అభ్యర్థి హాల్ టికెట్, కేటగిరి) విడుదల చేసి ఉండాల్సిందని, అప్పుడు ఏయే కేటగిరీల్లో ఎంతమంది అభ్యర్థులు ఎంపికయ్యారనే విషయంపై క్లారిటీ వచ్చేదని మంత్రులు తమ ఇంటర్నల్ మీటింగ్‌లో అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదంతా చేయాల్సిన సీనియర్ ఐఏఎస్‌లు తమకు ఏం సంబంధం అనే తీరుగా వ్యవహరించడం వల్లే, వివాదాలు ముదురుతున్నాయనే పెదవి విరిచినట్టు టాక్. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే అభ్యర్థులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారని, చివరకు మెయిన్స్ ఫలితాలు ప్రశ్నార్థకంగా మారాయని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed