తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్..

by sudharani |   ( Updated:2022-11-25 16:03:54.0  )
తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అభినందన సభ శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా స్కై రూట్ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సృష్టించిందన్నారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. స్కైరూట్ ప్రతిపాదిస్తున్న సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

స్కై రూట్ సక్సెస్‌తో హైదరాబాద్, టీ హబ్ పేరు మరోసారి మారుమోగిందన్నారు. దేశ అంతరిక్షరంగంలో చరిత్ర సృష్టించిన స్కై రూట్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. స్పేస్ టెక్ కేపిటల్‌గా హైదరాబాద్ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేయబోతుందని, త్వరలో మరో సక్సెస్ స్టోరీని దేశం చూడబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్పేస్ టెక్ పాలసీతో ఇక్కడే రాకెట్‌లు తయారుచేయవచ్చని, ఇక్కడి నుంచే ప్రయోగించవచ్చని వెల్లడించారు. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని సహకరించాలని స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ కేటీఆర్కు విజ్ఞప్తి చేయడంతో పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి పవన్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed