ఇంటికి రూ.5 లక్షలు.. ఐదు వందలకే సిలిండర్!

by GSrikanth |
ఇంటికి రూ.5 లక్షలు.. ఐదు వందలకే సిలిండర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గడపగడపకు కాంగ్రెస్’ అనే కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. గడిచిన రెండు రోజుల నుంచి జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్‌ఛార్జులు, టీపీసీసీ మెంబర్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్​షురూ అయినట్లు నేతలు పేర్కొంటున్నారు. ఇంటింటికీ ప్రచారంలో ప్రజల మద్దతును కోరుతున్నారు. కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇవ్వడమే ఎక్కువంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి ఓటు వేయాలని పార్టీ ముఖ్యనేతలు ప్రజలను అభ్యర్ధిస్తున్నారు. మెరుగైన పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమంటూ టీపీసీసీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్​పార్టీ అధికారంలో వస్తే చేయబోయే అంశాలను వివరిస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్​నెరవేరుస్తున్నదని, ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని నేతలు పబ్లిక్‌ను కన్విన్స్​చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది పబ్లిక్​కాంగ్రెస్‌పై సానుభూతి చూపుతున్నట్లు స్వయంగా ఆ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు.

హామీలతో ఆసరా?

కాంగ్రెస్​పార్టీ ఇస్తున్న హామీలతో ప్రజలు కాస్త రిలాక్స్​అవుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్​ఇస్తున్న హామీ పేదలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ప్రభుత్వం డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు ఇస్తామని గడిచిన ఎనిమిదేళ్లుగా ప్రకటిస్తూనే ఉన్నా.. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చలేకపోయింది. పైగా ఇప్పుడు గృహలక్ష్మి పథకం అంటూ స్థలం ఉన్నోళ్లకు రూ.3 లక్షలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తామని ప్రకటించింది. డబుల్​బెడ్ రూమ్ హామీలానే ఇది కూడా క్షేత్రస్థాయిలో అందరికీ అందే ఛాన్స్​ఉండదనే అభిప్రాయం చాలామంది ప్రజల్లోకి వచ్చింది. అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్​పార్టీ ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంటే.. పబ్లిక్ సైతం కాంగ్రెస్‌లో కాస్త భరోసా పెట్టుకున్నది. గతంలో కాంగ్రెస్​పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే వలే ఇప్పుడు ఇస్తున్న హామీలను కూడా నెరవేరుస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఇక 2లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, 4000 రూపాయల నిరుద్యోగ భృతి, 500 కి గ్యాస్ సిలిండర్, ధరణి పోర్టల్ రద్దు లాంటి పథకాలను కూడా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయనున్నట్లు టీపీసీసీ కి చెందిన ఓ నేత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed