కౌశిక్‌రెడ్డి ఆ సంగతి మర్చిపోయారా?.. ఇందిరా శోభన్ ఆగ్రహం

by Gantepaka Srikanth |
కౌశిక్‌రెడ్డి ఆ సంగతి మర్చిపోయారా?.. ఇందిరా శోభన్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ నేతలు మాస్టర్స్ డిగ్రీ చేశారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్.. పదేండ్లలో అక్కడి స్థానికులకు ఓటు బ్యాంకు కోసం వాడుకున్నదన్నారు. సెంటిమెంట్ రాజకీయాలతో పబ్బం గడుపుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఇక్కడి నివాసులపై బీఆర్ఎస్ నేతలు ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన కామెంట్లు చేశారని అన్నారు. ఆ రోజు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేసిన గులాబీ లీడర్ల నిజ స్వరూపం ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాటల్లో బహిర్గతమైందన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన అరికెపూడి గాంధీ బతకడానికి హైదరాబాద్ వచ్చారని, కేసీఆర్ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆంధ్రా సెటిలర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఇందిరాశోభన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆంధ్రకు చెందిన వ్యక్తి అని తెలియదా అని ప్రశ్నించారు.

ఆంధ్రకు చెందినవారికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అంటూ తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై కురిపించిన ప్రేమ గురించి కౌశిక్‌రెడ్డికి తెలియదా అని నిలదీశారు. అదే సెటిలర్లతో ఓట్లు వేయించుకుని పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పట్లో ఎన్నికలు లేవని తెలిసి వారి నిజ స్వరూపాన్ని కౌశిక్‌రెడ్డి ద్వారా బహిర్గతం చేస్తున్నారా అని ఇందిరాశోభన్ ప్రశ్ని,చారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మహిళలపై గతంలో అనేకసార్లు అనుచిత వాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు కూడా చీరలు, గాజులు చూపిస్తూ కింపరిచారని, ఆయనపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతినెలా, శాంతి భద్రతలకు భంగం కలిగేలా హరీష్‌రావు వ్యవహారాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు సొంత ఆస్థిత్వాన్ని కాపాడుకోవడానికి కుట్రలు పన్నుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story