అంతుచిక్కని బన్సల్ వ్యూహం.. మునుగోడుపై హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-11 07:08:53.0  )
అంతుచిక్కని బన్సల్ వ్యూహం.. మునుగోడుపై హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న మునుగోడులో కాషాయ జెండా పాతేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ బైపోల్ లో తనదైన మార్క్ ను చూపించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. హస్తిన నుంచి తాజాగా వచ్చిన ఆదేశాల అమలుకు నేతలు తలమునకలయ్యారు. మునుగోడులో పార్టీ మార్క్ కనిపించాలని వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వివిధ క్షేత్రాలు రంగంలోకి దిగాయి. హుజురాబాద్ తరహాలో వ్యక్తిగత ఇమేజ్ పార్టీని డామినేట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించింది.

మునుగోడు ఉపఎన్నికల కార్యాచరణలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం హంగూ ఆర్భాటాలకు పోకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఇతర పార్టీలకు తమ స్ట్రాటజీ ఏంటో అంతుచిక్కకుండా ఉండేలా పకడ్బందీగా తమ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో అమిత్ షా పంపించిన స్పెషల్ టీం ఎవరికీ తెలియకుండా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన నివేదిక ఆధారంగానే బన్సల్ మునుగోడు ఎలక్షన్ కు సంబంధించిన పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

ఈ బైపోల్ లో బన్సల్ ప్లానింగ్ కీలకంగా మారనుంది. ఎన్నికల వ్యూహరచనలో దిట్టగా బన్సల్ కు మంచి రికార్డ్ ఉంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఏరికోరి మరీ ఆయనను తెలంగాణకు పంపించారు. ఢిల్లీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన మార్క్ ను తెలంగాణపై కూడా వేయాలని ఉత్సాహంతో బన్సల్ ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహరచన చేస్తారనేది అంతుచిక్కడం లేదు. యూపీలో బన్సల్ వ్యూహ రచనతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. మరి తెలంగాణలో ఎలాంటి మార్క చూపిస్తాడనేది వేచి చూడాల్సిందే.

ఈటల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వల్ల హుజురాబాద్ ను చేజిక్కించుకోవడం బీజేపీకి కాస్త సులువుగా మారింది. అయితే భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ఇమేజ్ పెంచుకోవడంపై దృష్టి సారించాలని స్థానిక నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు సమాచారం. దీనివల్ల గ్రామస్థాయికి పార్టీని తీసుకెళ్లడంలో సక్సెస్ కావొచ్చని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారు. నేతల పేర్లు చెప్పుకుని గెలవడం కాకుండా పార్టీ పేరు చెప్పి నేతలు గెలిచే స్థాయికి ఎదగాలని అధిష్టానం భావిస్తోంది.

మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. పరుగెత్తి పాలు తాగడం కన్నా.. నించొని నీళ్లు తాగడం మిన్న అనే పాలసీతో ముందుకు వెళ్తోంది. నోటిఫికేషన్ వచ్చాక ఇబ్బందులు పడేకంటే ముందు నుంచే అంతా సిద్ధం చేసుకోవడం ఉత్తమమని భావిస్తోంది. మునుగోడులో ఉన్న 7 మండలాల్లో మొత్తం 159 గ్రామాలున్నాయి. మునుగోడు, చండూరు, మర్రిగూడ, చౌటుప్పల్, గట్టుప్పల్, సంస్థాన్ నారాయణ్ పూర్, నాంపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించి విజయఢంకా మోగించాలని యోచిస్తోంది. ఈ బైపోల్ లో గెలిచి ప్రజలంతా తమవైపే ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపి వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సునాయాసం చేసుకునే పనిలో పార్టీ పడింది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇన్ చార్జి సునిల్ బన్సల్ ఆదివారం మునుగోడులో పర్యటించనున్నారు. స్థానికంగా బీజేపీ స్థితి, కేడర్ బలోపేతంపై స్వయంగా గ్రౌండ్ లోకి వెళ్లి పరిశీలించనున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఇమేజ్ ఎంత వరకు కలిసిరానుందనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల వ్యూహాన్ని రచించాలని బన్సల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు బైపోల్ నేపథ్యంలో ప్రజల నాడి ఎటువైపు అనే అంశంపై దృష్టిసారించడంతో పాటు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో జరుగుతున్న ప్రచారాలకు, వాస్తవికతకు ఎంతమేర తేడా ఉందని అంచనా వేయనున్నారు. మునుగోడులో బన్సల్ పర్యటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read : టీ-కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి గుడ్‌న్యూస్


ఇవి కూడా చ‌ద‌వండి :

మరోసారి చారిత్రిక తప్పిదం వైపు 137ఏళ్ల కాంగ్రెస్ పార్టీ!! ఆ లక్షణాలే రాహుల్ కొంప ముంచుతున్నాయా?

లోక్ సభ బరిలో సీఎం కేసీఆర్? పోటీ అక్కడ నుంచే?

Advertisement

Next Story