ఇకపై తెలంగాణ హైకోర్టులో కొత్త విధానం అమలు

by GSrikanth |   ( Updated:2023-08-15 17:27:43.0  )
ఇకపై తెలంగాణ హైకోర్టులో కొత్త విధానం అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మాత్రమే కాక పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఇకపైన కోర్టుల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలుచేయనున్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే తెలిపారు. పంద్రాగస్టు సందర్భంగా హైకోర్టులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత చేసిన ప్రసంగంలో పై అంశంతో పాటు పలు కొత్త విధానాలకు శ్రీకారం చుట్టడం గురించి ప్రస్తావించారు. వీలైనంత తొందరలోనే కోర్టుల్లో పేపర్‌లెస్ విధానాన్ని గరిష్ట స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిటిషన్లను కూడా ఫిజికల్ రూపంలో దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ-ఫైలింగ్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఇప్పటికే పలు కేసులకు సంబంధించి ఫిజికల్‌గా ఉన్న డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదన్నారు. దాదాపు ఎనిమిది కోట్ల డాక్యుమెంట్ల కన్వర్షన్ పూర్తయినట్లు తెలిపారు.

కేసుల విచారణను సైతం వీలైనంతవరకు ఆన్‌లైన్ ద్వార ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని బెంచీలలో ఇది జరుగుతూ ఉన్నదని, న్యాయవాదులు కూడా ఆన్‌లైన్ ద్వారానే వాదించేందుకు తగిన మౌలిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రికార్డులన్నీ డిజిటలైజ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వర్చువల్ హియరింగ్ చేసేందుకు సంసిద్ధమవుతామని వివరించారు. కానీ అన్ని కోర్టుల్లోనూ ఈ నూతన సిస్టమ్ అమల్లోకి రావాలంటే దానికి తగిన మెకానిజం, ఎక్విప్‌మెంట్, మౌలిక సౌకర్యాలు సమకూరాల్సి ఉంటుందన్నారు. జిల్లా కోర్టుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి ఫస్ట్ ఫేజ్‌లో 13 జిల్లాలను ఎంపిక చేశామన్నారు.

ఈ కోర్టుల నిర్మాణాలకు సంబంధించిన పరిపాలనాపరమైన అనుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థలోని పెండింగ్ కేసుల గురించి చీఫ్ జస్టిస్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, హైకోర్టు స్థాయిలో కేసుల పరిష్కారం గతంకంటే వేగంగా పెరిగిందన్నారు. జడ్జీలు, న్యాయవాదుల సహకారంతో కేసుల విచారణ కూడా వేగం అందుకున్నదని, ఇది మరికొంత స్పీడ్ కావడంపై ఇటీవలే చర్చించుకున్నామని, త్వరలోనే ఫలితాలు వస్తాయన్నారు. లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే విజ్ఞప్తులు అందాయని, ఇవి కూడా పరిష్కారమవుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed