మా పార్టీని ఓడిస్తారేమో.. ఓడించండి..! మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-05 02:51:53.0  )
మా పార్టీని ఓడిస్తారేమో.. ఓడించండి..! మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ బ్యూరో : రానున్న ఎన్నికల్లో మా పార్టీని ఓడిస్తారేమో.. ఓడించండి. ఐదేళ్లు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాం అంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి మండలంలో పీడబ్ల్యూడీ డబ్బులు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి విచ్చేశారు. అదే సందర్భంలో ఆశా వర్కర్లు తమ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. దీంతో ఆశా వర్కర్లపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల వాళ్లు పంపిస్తే ఇక్కడికి వచ్చారా... పార్టీ కార్యాలయాల్లోనే దీక్షలు చేసుకోండి.

మెడ మీద కత్తి పెట్టి చంపుతామని బెదిరిచ్చేటట్టు ఉంది మీ తీరు... అంటూ ఫైర్ అయ్యారు. మా పార్టీని ఓడించాలని అనుకున్నట్టు ఉంది మీరు... ఓడిస్తే ఐదేళ్లు విశ్రాంతి తీసుకుంటాం.. ఓడిస్తే అయ్యేదేముంది.. అని మహిళలపై మంత్రి మండిపడ్డారు. ఇది ఇలా ఉంటే మంత్రి మాట్లాడుతున్నా సమయంలో అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నింటిని ఓ మహిళ తన సెల్ ఫోన్లో వీడియో తీస్తుండడంతో ఆ మహిళ ఫోన్‌ను మంత్రి భద్రతా సిబ్బంది లాగేసుకున్నారు. వారందరిని అక్కడినుంచి వెళ్లగొట్టారు. మంత్రి మాట్లాడిన మాటలతో ఆశా వర్కర్లు తమ దగ్గరికి వస్తే కూడా ఇలాగే మాట్లాడతామని హెచ్చరించుకుంటూ వెళ్లిపోయారు.

Advertisement

Next Story