NHAI: తెలంగాణ రోడ్లపై 336 బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు

by Mahesh |
NHAI: తెలంగాణ రోడ్లపై 336 బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రోడ్లపై చాలా కాలంగా ఉన్న బ్లాక్ స్పాట్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఐడెంటిఫై చేసింది. వాటి నిర్మూలనకు కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (NH) అడుగులు వేస్తున్నది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లపై దాదాపు 336 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిసింది. అయితే, గత మూడు సంవత్సరాల్లో ‘నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా’ పరిధిలో ఉండే జాతీయ రహదారులపై ఉన్న 3,996 బ్లాక్‌స్పాట్‌లపై 57,329 ప్రమాదాల జరిగితే 28,765 మంది మృత్యువాతపడ్డారని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 336 బ్లాక్‌స్పాట్‌లతో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అయితే, ఈ బ్లాక్‌స్పాట్‌ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకొని వాటిని రూపుమాపేందుకు NHAI చర్యలు ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు కలిసి రూ. 7,500 కోట్లు ఖర్చు చేసి... ఆ ప్రదేశాలను ప్రమాద రహితంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది మధ్యలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌స్పాట్‌లపై పనులు మొదలు పెట్టాలని యోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పనులకు సంబంధించిన డ్రాఫ్టును సైతం NHAI సిద్ధం చేసిందని తెలిసింది. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పని చేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి గుండా వెళ్ళే ఎన్ హెచ్-163పై అత్యధికంగా 38 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో నేషనల్‌ హైవేల నిడివి 3,174 కిలోమీటర్లు ఉండగా... 25 జాతీయ రహదారుల్లో మొత్తం 342 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా( NHAI) అధికారులు వెల్లడించారు.

మిగతా ఎన్‌హెచ్ లపై కూడా పదుల సంఖ్యలోనే బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ బ్లాక్‌స్పాట్ల సమీప ప్రాంతంలో హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఎన్ హెచ్ ఏఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్లాక్‌స్పాట్‌ వద్ద రోడ్డుకు రెండు వైపుల భద్రతాతో కూడిన బోర్డులు, హెచ్చరిక బోర్డులు పెట్టనున్నారు. దీంతోపాటు, అవసరమైన చోట గ్రేడ్‌ సెపరేటర్స్‌ నిర్మాణం, రోడ్డు వెడల్పుల వంటివి కూడా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ఉపరితల, రోడ్డు రవాణా శాఖ డ్రాఫ్టు కూడా తయారు చేసిందని సమాచారం. దేశవ్యాప్తంగా మొత్తం ఈ పనుల కోసం ఖర్చు చేసే రూ. 7,500 కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ. 680 కోట్లు వరకు వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story