వార్డు ఆఫీసర్లకు బయోమెట్రిక్ భయం.. తప్పించుకునేందుకు ప్రయత్నాలు

by Hamsa |
వార్డు ఆఫీసర్లకు బయోమెట్రిక్ భయం.. తప్పించుకునేందుకు ప్రయత్నాలు
X

దిశ, సిటీ బ్యూరో: కఢక్ ఖాధీ డ్రెస్..అచ్చం పొలిటికల్ లీడర్లుగా ఉంటారు. వెంటా మంది మార్బలం కూడా. చేసేదేమో జీహెచ్ఎంసీలో నౌకరి. లుకేమో ఏ కార్పొరేటరో, ఎమ్మెల్యేనో అనుకునేలా ఉంది. నౌకరికి ఆయా రాం..గయా రాం అన్నట్టు మార్నింగ్ వచ్చి సంతకాలు పెట్టి, బయటకు వెళ్లిపోతారు. ప్రశ్నిస్తే తాను యూనియన్ లీడర్ నంటూ డాగేస్తారు. ఈ బిల్డప్ లకు వార్డు ఆఫీసులను ప్రారంభించిన వెంటనే చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ లో ప్రతి 50 వేల మందికి ఓ వార్డు ఆఫీసు ఏర్పాటు చేసే ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, మొత్తం 150 వార్డులకు గాను వార్డు శానిటేషన్ ఆఫీసర్‌గా శానిటేషన్ జవాన్లను నియమించడంతో పాటు వారికి శిక్షణ ను కూడా పూర్తి చేశారు.

ఈ వార్డు ఆఫీసులకు శానిటేషన్ ఆఫీసర్లుగా నియమితులైన జవాన్లు ఉదయం ఐదు గంటల నుంచి వార్డు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. వార్డు పాలన మొదలుకాగానే, ఈ ఆఫీసర్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా వీరికి వార్డు ఆఫీసులోనే బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలిసి ఇప్పటికే నియమితులైన 150 మంది వార్డు శానిటేషన్ ఆఫీసర్లలో సగం మంది ఆరోగ్య కారణాలను చూపుతూ తమకు వార్డు శానిటేషన్ ఆఫీసర్ల నియామకానికి మినహాయించాలని కమిషనర్ కు వినతి పత్రాలను సమర్పించుకుంటున్నట్లు సమాచారం. రేపు వార్డు ఆఫీసు ప్రారంభం తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తే మునుపు లాగా ఉదయాన్నే సంతకం చేసి, బయటకు వెళ్లే పరిస్థితులు, బయట వసూళ్లు, పైరవీలు వంటి ఉండవనే భయంతో ఆరోగ్య కారణాలను చెబుతూ తప్పించుకునేందుకు అవస్థలు పడుతున్నట్లు సమాచారం.

మినహాయింపు కోసం సవాలక్ష కారణాలు

ఇప్పటికే వార్డు శానిటేషన్ ఆఫీసర్లుగా నియమితులైన 150 మంది జవాన్లలో ఇప్పటికే 20 మంది వివిధ కారణాలను చూపుతూ తాము వార్డు శానిటేషన్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించలేదని తేల్చి చెబుతున్నట్లు తెలిసింది. వీరిలో చాలా మంది తమకు దూరమవుతుందని, కొందరు తమకు బీపీ, షుగర్ ఉందని, మరి కొందరైతే తమ భార్య దీర్గకాలింకా అనారోగ్యంగా ఉందని, తాను ఇంటికి సమీపంలో అందుబాటులో ఉండాలని, ఇంకొందరైతే ఇంట్లో తమ అమ్మా, నాన్నలు వృద్దులని, వారికి సేవ చేసుకునేందుకు సకాలంలో ఇంటికెళ్లాల్సి ఉంటుందంటూ సవాలక్ష కారణాలను చూపుతూ తప్పించుకునే పనిలో ఉన్నారు.

దీని కన్నా ..అదే బెటర్

వార్డు శానిటేషన్ ఆఫీసర్లుగా నియమితులైన వారు శిక్షణకు హాజరు కాని పక్షంలో, విధుల నిర్వహణ ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తే, వారికి డిమోషన్ ఇచ్చి కామాటీలుగా పని చేయిస్తామని ఇప్పటికే వారిపై అధికారులు అల్టిమేటమ్ జారీ చేసిన సంగతి తెల్సిందే. కానీ వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహించటం కన్నా కామాటీగా పని చేయటమే బెటర్ అని కొందరు జవాన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తమకు డిమోషన్ ఇచ్చినా, జీతం తగ్గించినా ఫర్వాలేదని, ఇది వరకు తాము ఎక్కడ పని చేశామో అక్కడే కొనసాగించాలని కొందరు జవాన్లు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల వత్తిడికి తలొగ్గి వార్డు ఆఫీసర్లు పని చేస్తారా? లేక వారికి వత్తిడికి తలొగ్గి అధికారులు ప్రత్యామ్నాయ ఆఫీసర్లను నియమిస్తారా? వేచి చూడాలి.

Advertisement

Next Story