Collector Anudeep Durishetti : ఉన్నత స్థాయికి ఎదగాలంటే లక్ష్యం నిర్ధేశించుకుని చదవాలి

by Sridhar Babu |
Collector Anudeep Durishetti : ఉన్నత స్థాయికి ఎదగాలంటే లక్ష్యం నిర్ధేశించుకుని చదవాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని, ప్రణాళిక బద్ధంగా ఇష్టపడి చదవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్థులకు సూచించారు. షేక్ పేట్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ హైస్కూల్, జూనియర్ కళాశాలలో గురువారం స్వచ్ఛదనం , పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మొక్కలు నాటిన కలెక్టర్ అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. జీవితంలో ఇంటర్మీడియట్ విద్య టర్నింగ్ పాయింట్ అని, మంచి కళాశాలలో సీటు వస్తే జీవితంలో స్థిరపడవచ్చన్నారు. బీటెక్, ఐఐటీ, నీట్, బిట్స్ లో చేరేందుకు విద్యార్థులు లక్ష్య సాధనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.

మూడు నెలలు, నెల, వారం, ప్రతిరోజూ ప్రణాళికతో బాగా చదివి లక్ష్యం సాధించాలన్నారు. ఎవరెస్ట్ ఎత్తును చూసి భయపడొద్దని, ఎలా ఎక్కాలనే ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా అనుకున్నది సాధించవచ్చని అన్నారు. విద్యతోనే గౌరవం పెంపొందుతుందన్నారు. అనంతరం కళాశాలలోని ల్యాబ్ లను పరిశీలించి వాటిల్లో కావలసిన సౌకర్యాలు, కళాశాల మరమ్మతులకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ఉపసంచాలకులు యాదయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.బాలస్వామి, వైస్ ప్రిన్సిపాల్ ఎం. మల్లేశం, జోనల్ ఆఫీసర్ భీమయ్య, తహసీల్దార్ అనితా రెడ్డి, పీడీ హరికృష్ణ, సీహెచ్.బాలరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story