సెట్విన్ సంస్థకు గొప్ప చరిత్ర ఉంది

by Sridhar Babu |
సెట్విన్ సంస్థకు గొప్ప చరిత్ర ఉంది
X

దిశ, చార్మినార్ : నిరుద్యోగ యువతీయువకుల కోసం ఏర్పాటు చేసిన సెట్విన్ కు గొప్ప చరిత్ర ఉందని, ఈ ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ సంస్థకు నూతనంగా చైర్మన్ గా నియమితులైన ఎన్. గిరిధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో కలిసి హాజరై ఆయనను అభినందించి ప్రసంగించారు. జంట నగరాల్లోని నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 1978 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఒక మంచి ఆశయంతో సెట్విన్ సంస్థను స్థాపించారని అన్నారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.

జంట నగరాలతో పాటు సెట్విన్ మినీ బస్సు సర్వీసులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే కార్యక్రమానికి తమవంతు సహకారం ఉంటుందని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ సెట్విన్ సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని అన్నారు. నిరుద్యోగ యువత సెట్విన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సెట్విన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ సేవలను విస్తరింపచేయడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. త్వరలోనే జహీరాబాద్, తాండూర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలలో సెట్విన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ సేవలను విస్తరింప చేయడానికి తన వంతు కృషి చేస్తానని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. స్కిల్ ట్రైనింగ్ లో నిరుద్యోగ యువతకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాల్ రావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎంఎస్ఏ పట్లోళ్ల సంజీవ కిష్టారెడ్డి, ఎంఎల్ సీ బలమూరి వెంకట్, జహీరాబాద్ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉజ్వల్ రెడ్డి, ఫహీమ్, మహమ్మద్ అజహారుద్దీన్, సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్ బాబు, లీగల్ అడ్వైసర్ ఎంఏ మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story