రైతాంగ డిమాండ్లకు ఉద్యోగుల మద్దతు

by S Gopi |
రైతాంగ డిమాండ్లకు ఉద్యోగుల మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ రాంలీలా మైదానంలో దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు చేస్తున్న నిరసనలకు కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) తదితర సంస్థలు మద్దతు ప్రకటించాయి. 2021 డిసెంబర్‌ 9న కేంద్రం రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీజీజీఓఓ జాతీయ ఉపాధ్యక్షుడు వి.కృష్ణ మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చులు, రైతులు తమ పంటలకు లాభదాయకమైన ధరలు పొందకపోవడం కారణంగా, దేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది రైతులు భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు బలవుతున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై ఎస్కేఎం అనేకసార్లు అనుమానాలను ఎత్తి చూపిందనీ, ఎంఎస్పీ, పేర్కొన్న ఎజెండా రైతుల డిమాండ్లకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎంతో చర్చించిన తర్వాతనే విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఎస్కేఎంకి రాతపూర్వక హామీ ఇచ్చిందనీ, అయితే ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్‌, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల డిమాండ్‌ను పరిష్కరించాలన్నారు. కేరళ తరహాలో రైతు రుణ ఉపశమన చట్టం తీసుకురావాలన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, నిరంతర పోరాటమే మార్గమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed