మరోసారి రోడ్డెక్కిన ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రి టెక్ ఉద్యోగులు

by Aamani |
మరోసారి రోడ్డెక్కిన ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రి టెక్ ఉద్యోగులు
X

దిశ, శేరిలింగంపల్లి : ల్యాబ్ టూ ల్యాండ్ ఉద్యోగులు మరోసారి రోడెక్కారు. మంగళవారం టీ హబ్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ల్యాబ్ టూ ల్యాండ్ కంపెనీ సీఈఓ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రాయదుర్గం టీ హబ్ లో రెండు సంవత్సరాల క్రితం ఆదిత్య దేశ్ పాండే ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రిటెక్ పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. రైతులకు విత్తనాలతో పాటు ఎరువు మందులు, ఇతర పెస్టిసైడ్స్ విక్రయించే వారు. ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. అలాగే ఈ కంపెనీ వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది.

ఒక్కొక్క జిల్లాకు ఒక మెయిన్ డీలర్, మండలానికి ఒక డీలర్, వీరి కింద మళ్లీ సబ్ డీలర్స్ ను నియమించుకున్నారు. అయితే ఉద్యోగులకు తెలియకుండా ల్యాబ్ టూ ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓ ఆదిత్య దేశ్ పాండే వారి డాక్యుమెంట్లపై లోన్లు తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరి పేరు మీద లక్ష నుండి రెండు లక్షల వరకు లోన్లు తీసుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అలాగే కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ కు జీతాలు ఇవ్వకుండా ఉన్న పళంగా కంపెనీని మూసివేశారు. దీంతో గతంలో ఆందోళనకు దిగిన ఉద్యోగులు సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం మరోసారి టి హబ్ ముందు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన రాయదుర్గం పోలీసులు ఆదిత్య దేశ్ పాండేను అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed