నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే...

by Kalyani |
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే...
X

దిశ, ఆందోల్: నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. సాయిలు గుర్తుచేశారు. మంగళవారం జోగిపేట లోని క్లాక్ టవర్ వద్ద ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ పోరాట వీధి నాటకం శౌర్య యాత్రను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మద్రాసు, మహారాష్ట్ర, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు 11 జిల్లాలో నిజాం పాలనలో ఎన్నో అరాచకాలకు, ఆకృత్యాలకు పాల్పడితే, ఇందుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం 1930 సంవత్సరంలో ఉద్యమాల గడ్డ జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభ పురుడు పోసుకోగా, 1951 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిందన్నారు. రైతులు పండించిన పంటలను దోచుకునేందుకు ఖాసీం రాజ్వీ, దొర రామచంద్ర రెడ్డిలు ప్రయత్నాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ అడ్డుకోగా, ఆమెకు అండగా దొడ్డి కొమురయ్య నిలిచారన్నారు.

రామచంద్ర రెడ్డి నిజాం సైనికులతో కలిసి దొడ్డి కొమురయ్యను కాల్చి చంపినా, కమ్యూనిస్టులు మాత్రం ఉద్యమాన్ని ఆపలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తీరును ప్రజానాట్యమండలి కళ్లకు కట్టినట్టు చూపించిన కళాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి. విద్యాసాగర్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఏ. నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, నాయకులు సురేష్, రాములు, పెంటయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎర్పుల వెంకన్న, చంద్ర మౌళి, గంతేపాక శివ, గంటెపాక శ్రీ కృష్ణ, నరేష్ తదితరులు ఉన్నారు.

Next Story