UP: హోటళ్లలో యజమానుల పేర్లు, అడ్రస్ తప్పనిసరి.. సీఎం యోగి కీలక ఆదేశాలు

by Harish |   ( Updated:2024-09-24 12:04:41.0  )
UP: హోటళ్లలో యజమానుల పేర్లు, అడ్రస్ తప్పనిసరి.. సీఎం యోగి కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల తినే ఆహార పదార్థాలలో ఉమ్మివేయడం వంటి చర్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ అక్కడ తినుబండరాలు విక్రయించే హోటళ్లు, ధాబాలు మొదలగు వాటికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వాహకులు, యజమానులు వారి పేర్లు, చిరునామాలను తప్పనిసరిగా కస్టమర్లకు కనిపించేలా ప్రదర్శించాలని, సీసీటీవీలను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు చెఫ్‌లు, వెయిటర్లు మాస్క్, గ్లోవ్స్ ధరించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశించారు.

లక్నోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలు ఉండటం "అసహ్యకరమైనది". ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాబాలు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాలను విక్రయించే వాటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ప్రతి ఉద్యోగి పోలీసు ధృవీకరణ కలిగి ఉండాలి, ఆహార పదార్థాల స్వచ్ఛత, పవిత్రతను నిర్ధారించడానికి ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో అవసరమైన సవరణలు కూడా చేయాలని యోగి అన్నారు.

దేశవ్యాప్తంగా ఆహార కల్తీ కేసులు పెరగడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జ్యూస్, పప్పులు, రోటీ వంటి ఆహార పదార్థాలను మానవ వ్యర్థాలతో కల్తీ చేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గత వారం ఘజియాబాద్‌లోని పండ్ల రసంలో మూత్రం కలిపిన ఆరోపణలపై జ్యూస్ విక్రయించే వ్యక్తిని అరెస్టు చేశారు. సెప్టెంబరు 12న, సహరన్‌పూర్ జిల్లాలోని రోటీలను తయారు చేస్తున్నప్పుడు ఒక యువకుడు రోటీలపై ఉమ్మివేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో కనిపించింది.

దీంతో సర్కార్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు భయంకరమైనవి, సామాన్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అధికారులు ఈ ఘటనలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఆహార సంస్థల నిర్వాహకులతో సహా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ధృవీకరించాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు.

Advertisement

Next Story