Kejriwal: దొంగగా చిత్రికరించేందుకే నన్ను అరెస్ట్ చేయించారు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

by vinod kumar |
Kejriwal: దొంగగా చిత్రికరించేందుకే నన్ను అరెస్ట్ చేయించారు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: తనను దొంగగా చిత్రీకరించాలనే ఉద్దేశంతోనే బీజేపీ అరెస్ట్ చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఒకవేళ తాను అవినీతిపరుడినే అయితే ఇప్పటికే రూ.3000 కోట్లు జేబులో వేసుకునే వాడినని తెలిపారు. హర్యానాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అసలు నేను చేసిన తప్పేంటని బీజేపీని నిలదీశారు. ‘ఢిల్లీకి పదేళ్లు సీఎంగా ఉన్నా. పేదల పిల్లల కోసం మంచి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేశా. కరెంటు కోతలు లేకుండా చేశా. ఢిల్లీ, పంజాబ్‌లలో ఫ్రీ కరెంట్ అందించా. ఇదేనా నేను చేసిన తప్పు’ అని ప్రశ్నించారు. వృద్ధుల కోసం ఉచిత తీర్ధయాత్రలు వంటి పథకాలను అవినీతిపరులెవరూ తీసుకురాలేరన్నారు.

ఢిల్లీలో తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందించిందని ఇందుకు గాను భారీగా డబ్బు అవసరం ఉంటుందని తెలిపారు. ఒక వేళ నేను దొంగ అయి ఉంటే రూ.3000 కోట్లు జేబులో పెట్టుకోగలిగే వాడినని తెలిపారు. అంతేగాక పేద పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశానని, దానిలో కూడా ఖర్చు ఉంటుందని..అవినీతికి పాల్పడితే ఆ డబ్బు కూడా నా ఖాతాలోకి వచ్చి చేరేందన్నారు. బీజేపీ తన నిజాయితీ, ప్రతిష్టను దిగజార్చాలని భావించినందుకే జైలులో పెట్టారని ఆరోపించారు. జైలులో నన్ను మానసికంగా, శారీరకంగా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మందులు, ఇన్సులిన్ ఇవ్వడం మానేశారని తెలిపారు.

నేను నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడని భావిస్తేనే హర్యానా ప్రజలు తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఆప్ అభ్యర్థులందరినీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిశీ బాధ్యతలు స్వీకరించారు.

Next Story