ప్రముఖ నటుడి అరెస్టుకు రంగం సిద్ధం

by Y. Venkata Narasimha Reddy |
ప్రముఖ నటుడి అరెస్టుకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. అక్కడి సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఈ కమిటీ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘మీటూ’ ఉద్యమంలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, హీరోలు పీకల్లోతు వివాదంలో ఇరుక్కుపోయారు. దీనిలో భాగంగా ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన ఓ నటి అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. నటిపై అత్యాచారం కేసులో కేరళ నటుడు సిద్దిఖీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వీలుగా లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. 2016లో తిరువనంతపురంలోని ప్రభుత్వ హోటల్లో సిద్ధిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేశారు. తొలుత సదరు నటి ఈ ఘటనపై ఫిర్యాదు చేయకూడదని భావించారు. గత నెల జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించడంతో ధైర్యంగా ముందుకొచ్చారు. మలయాళం సినీ పరిశ్రమలో మహిళలపై వ్యవస్థీకృత వేధింపులను ఈ నివేదికలో ప్రస్తావించారు. మాజీ నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకోవాలని ప్రోత్సహించారు.

ఈ క్రమంలోనే తనకు తమిళ చిత్రంలో పాత్ర ఇప్పిస్తానని.. అందుకు ప్రతిగా కోర్కెలు తీర్చాలని సిద్దిఖీ డిమాండ్ చేశాడని సదరు నటి ఆరోపించింది. అందుకు తాను నిరాకరించగా.. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇటీవల మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సిద్దిఖీ ఎంపికయ్యాడు. అతడిపై లైంగిక ఆరోపణలు తెరపైకి రావడంతో రాజీనామా చేశాడు. ఈ కేసు దర్యాప్తులో సిట్ తీరుపై బాధిత నటి అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తులో గోప్యత పాటిస్తే బాగుండేదని.. రెండు రోజుల క్రితం కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయని..డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశాలు బయటకు వచ్చాయని.. ఇది ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి పురిగొల్పుతుందని’ నటి ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడికి ఆధారాలు నాశనం చేసేందుకు తగిన సమయం దొరికిందని ఆరోపించింది. మరోవైపు తనపై ఆరోపణలు చేసిన నటి 2019 నుంచి వేధిస్తోందని సిద్దిఖీ ప్రత్యారోపణలు చేశారు. 2016లో తాను ఒక థియేటర్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించిందని.. హేమ కమిటీ రిపోర్టు వెలువడ్డ తర్వాత అత్యాచారం చేసినట్లుగా వాటిని మార్చి చెబుతోందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కేరళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

Next Story