చెత్త తూకంలో అవకతవకలు? అక్రమాలు తెలిసినా అధికారులు మౌనం

by sudharani |
చెత్త తూకంలో అవకతవకలు? అక్రమాలు తెలిసినా అధికారులు మౌనం
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో రోజురోజుకు అక్రమాలు పెరిగిపోతున్నాయి. మహానగరంలో 30 సర్కిళ్లలోని 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు, మరో ఆరు వేల కిలోమీటర్ల రోడ్డపై, కాలనీలు, బస్తీల నుంచి ప్రతి రోజు పోగవుతున్న చెత్తను లెక్కేయటంలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని శానిటేషన్ పనుల్లో భాగంగా చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను స్వీకరించిన రాంకీ సంస్థ ఈ విధులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది.

ఈ సబ్ కాంట్రాక్టర్లు, రాంకీ తరపున విధులు నిర్వహిస్తున్న సూపర్ వైజర్లు చెత్తను తూకం వేయటంతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. డైలీ రొటీన్‌గా వచ్చే చెత్త పరిమాణం కన్నా సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్తను లెక్కల్లో చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణ రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు నాలుగున్నర వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తవుతుందని జీహెచ్ఎంసీ అధికారుల లెక్కలు చెబుతుండగా, బక్రీద్, వినాయక చవితి పండుగ సమయంలో అదనంగా రెండు వేల నుంచి మూడు వేల మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కువ ఉత్పత్తి అవుతుందని లెక్కలు చూపుతున్నారు.

కానీ వాస్తవానికి ఉత్పత్తి అయ్యే చెత్త ఎంత? అన్నది అంతు చిక్కకుండా ఉంది. ఈ రకంగా లెక్కలు ఎక్కువ చూపుతూ పరోక్షంగా రాంకీకి ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకమైన లెక్కలకు సబ్ కాంట్రాక్టర్లు అనుమతిస్తే, వారి వాహనాల ట్రిప్పులను అదనంగా చూపుతూ సూపర్ వైజర్లు సబ్ కాంట్రాక్టర్లకు ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

ఒక్క లెక్క.. రెండు లాభాలు

చెత్త పరిమాణం ఎక్కువగా చూపడంతో పాటు సబ్ కాంట్రాక్ట్ వెహికల్స్ కాకుండా జీహెచ్ఎంసీ వెహికల్స్ ట్రిప్పులను కూడా అదనంగా చూపుతూ రెండు రకాలుగా లాభ పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రిప్పులు ఎక్కువగా చూపి, ట్రిప్‌ల వారీగా ఛార్జీలను వసూలు చేస్తున్న సబ్ కాంట్రాక్టర్లు, జీహెచ్ఎంసీ వాహనాలకు అదనపు ట్రిప్పులను చూపుతూ, ఆ అదనపు ట్రిప్పుల డీజిల్‌ను సబ్ కాంట్రాక్టర్లు తమ వాహనాల్లో వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ర్యాగ్ పిక్కర్స్‌ను వదలని వైనం

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లలో డంప్ చేస్తారు. ఆ తర్వాత ఈ చెత్తలో ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియం వంటివి ఏరుకునేందుకు వస్తున్న ర్యాగ్ పిక్కర్స్‌ను ట్రాన్స్ ఫర్ స్టేషన్‌లోకి అనుమతించేందుకు అక్కడున్న కేర్ టేకర్స్ ఒక్కో ర్యాగ్ పిక్కర్ నుంచి కనీసం రూ. వంద వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ట్యాంక్ బండ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్‌లోకి చెత్త ఏరుకునేందుకు వెళ్లిన ర్యాగ్ పిక్కర్స్ పేలుళ్లకు గురై ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కొద్ది రోజులు వారిని లోనికి అనుమతించకపోవడంతో ఈ వ్యవహారం కమిషనర్ వరకు వెళ్లింది. ఆ తర్వాత అంతా మామూలేనన్నట్టు కేర్ టేకర్లు ఒక్కోక్కరి నుంచి రూ. వంద తీసుకుని మళ్లీ లోనికి అనుమతిస్తున్నారు.

ఎంటమాలజీలోనూ ఇదే తతంగం

ఫాగింగ్ కోసం వినియోగించాల్సిన డీజిల్ కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ యూనియన్‌కు చెందిన నేత రోజుకి 20 లీటర్ల నుంచి 40 లీటర్ల వరకు డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకంగా వచ్చిన సొమ్ములో సీనియర్ ఎంటమాలజిస్టు మొదలుకుని, అసిస్టెంట్ ఎంటమాలజిస్టు, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వాటాలుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story