Air India: 34 ట్రైనీ విమానాలు ఆర్డర్ చేసిన ఎయిర్ ఇండియా

by S Gopi |
Air India: 34 ట్రైనీ విమానాలు ఆర్డర్ చేసిన ఎయిర్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కోసం 34 ట్రైనీ విమానాలను ఆర్డర్ చేసింది. ఇందులో అమెరికాలోని పైపర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి 31 సింగిల్ ఇంజిన్ ప్లేన్‌లను కొనుగోలు చేయనుండగా, మరో మూడు ట్విన్ ఇంజిన్ విమానాలను ఆస్ట్రియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే డైమండ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కొనుగోలు చేయనున్నట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్రాలోని అమరావతిలో ఉన్న బెలోరా విమానాశ్రయంలో ఫ్లయింట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌టీఓ)ను ఎయిర్ఇండియా ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెగ్యులేటరీ అనుమతుల కోసం పంపగా, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఎయిర్ఇండియాతో పాటు భారత విమానయాన రంగానికి ఈ ఎఫ్‌టీఓ ద్వారా పైలట్ శిక్షణ మౌలిక సదుపాయం, స్వయం సమృద్ధి కీలకం కానుందని ఎయిర్ఇండియా ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ సునీల్ భాస్కరన్ చెప్పారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ఇండియా తన విమానాల సేవలను, నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలోనే ఈ కొత్త ఎఫ్‌టీఓను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఎయిర్ఇండియాకు హర్యానాలోని గురుగ్రామ్‌లో కొత్త ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ ఉంది.

Advertisement

Next Story