గోదావరి పేజ్-2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Mahesh |   ( Updated:2024-08-07 02:39:51.0  )
గోదావరి పేజ్-2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి మున్ముందు కూడా తాగునీటి కొరత ఏర్పడకుండా సర్కారు ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే గోదావరి ఫేజ్-1 ద్వారా 163 మిలియన్ గ్యాలన్ల నీటిని పర్ డేకు సరఫరా చేస్తున్న జలమండలికి గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టును చేపట్టేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక ఈ ప్రాజెక్టు కింద 2600 ఎంఎం డయా భారీ పైప్ లైన్ ఏర్పాటు, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంతో పాటు ఇతరాత్ర వ్యయంతో కలిపి రూ.5,560 కోట్లను కేటాయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ఫేజ్ -2 ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవం చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో పనులు పూర్తి చేయాలని సర్కారు ఆదేశించింది. ఇటీవలే సర్కారు జీవో 344 ను జారీ చేసి 38 ఎస్టీపీల ప్రాజెక్టు కోసం రూ.3,849.10 కోట్లు కేటాయించగా, తాజాగా తాగునీటి సరఫరా, మూసీ ప్రక్షాళన, జంట జలాశయాల పునరుజ్జీవం కోసం నిధులు మంజూరు చేసింది. గడిచిన పదేళ్లలో ఇప్పటి వరకు రూ.9,410 కోట్ల రికార్డు స్థాయి నిధులను జలమండలికి కేటాయించటం ఇదే ఫస్ట్ టైమ్‌గా చెప్పవచ్చు.

750 ఎంజీడీలకు పెరగనున్న సప్లై..

ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 మిలియన్ గ్యాలన్ల నుంచి గరిష్టంగా 600 మిలియన్ గ్యాలన్ల నీడిని పర్ డే సరఫరా చేస్తున్నారు. కాగా 2030 వ సంవత్సరం వరకు తాగునీ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 170 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని లక్ష్యంతోనే సర్కారు గోదావరి ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తుంది. తాజాగా గోదావరి ఫేజ్-2 ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగించాలని సర్కారు భావిస్తోంది.

Advertisement

Next Story