Golconda Bonalu: ఘనంగా గోల్కొండ బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

by samatah |   ( Updated:2022-06-30 13:05:25.0  )
Golconda Bonalu has been started in hyderabad
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : Golconda Bonalu has been started in hyderabad| గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంతో తెలంగాణ‌లో ఆషాడమాసం బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. బోనాలలో పోతురాజులు, బాజా భజంత్రీలు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , మహమూద్ అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పండితుల వేద మంత్రాల నడుమ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా లంగర్ హౌజ్ నుండి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యుడు, ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహించారు. అక్కడి నుండి విగ్రహాలను దిగంబర్ పంతులు ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోల్కొండ చోటా బజార్, బడాబజార్ ప్రాంతాల మీదుగా విగ్రహాలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని అమ్మవారికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు . ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తరలుతున్న సమయంలో పలువురు మహిళలు పోటీ పడి సాక పోశారు . గోల్కొండ కోట ప్రవేశ ద్వారం వద్ద పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోటలోకి తొట్టెల, పూజారి కుటుంబ సభ్యులు తెచ్చిన బోనాలతో అమ్మవారి రథం ప్రవేశించింది. కోటపై సుమారు 350 మెట్ల పై నున్న అమ్మవారి ఆలయానికి విగ్రహాల తరలింపుతో తొలిరోజు బోనాలు ఉత్సవాలు మొదలయ్యాయి. 28 కులవృత్తుల వారు అమ్మవారికి పూజలు చేశారు. సుమారు 700 మంది పోలీసులు, పాటు షీ టమ్స్ తో బందోబస్తు నిర్వహించారు. ఆలయం మొత్తాన్నికవర్ చేసేలా 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

గురువారం ఉదయం 8 నుండి రామ్‌‌‌‌దేవ్‌‌‌‌ గూడ, మక్కి దర్వాజ, లంగర్ హౌస్, ఫతే దర్వాజ, సెవెన్ టూంబ్స్ రూట్ల నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు.వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, బోనం సమర్పించేందుకు వచ్చే భక్తులు మాస్కు తప్పనిసరి ధరించాలనే నిబంధన పెట్టారు . వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు,అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు . ఉత్సవాలను భక్తులు వీక్షించే విధంగా ప్రధాన ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ తో పాటు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేశారు . విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా ఉండేందుకు మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లు కూడా అందుబాటులో ఉంచారు.

వాహనాల పార్కింగ్ ఎక్కడంటే..

గోల్కొండ కోటలో బోనాలకు వాహనాలలో వచ్చే వారు తమ వాహనాలను రామ్ దేవ్ గూడ, మక్కి దర్వాజ నుంచి వచ్చే బైక్లు మిలటరీ సెంట్రీ పాయింట్ దగ్గర, కార్లను అషుర్ ఖానాలో పార్కింగ్ చేయాలి. లంగర్‌‌హౌస్‌‌ నుంచి వచ్చే బైక్లు, ఆటోలు హుడా పార్కు వద్ద, కార్లు సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్లో , సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే బైక్లు, ఆటోలు ప్రియదర్శిని స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ బస్టాప్ వద్ద, కార్లను సలార్ ఫుట్ బాల్ గ్రౌండ్లో పార్కింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వావిలాల మహేశ్వర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ శాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

Advertisement

Next Story