కేసీఆర్ ఫ్యామిలి రాష్ట్రాన్ని దోచుకుతింటుంది.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Sumithra |   ( Updated:2023-06-12 08:37:21.0  )
కేసీఆర్ ఫ్యామిలి రాష్ట్రాన్ని దోచుకుతింటుంది.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి : ఆంధ్రా నాయకులు దొంగలు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గద్దె నెక్కిన కేసీఆర్ ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా దోచుకుతింటున్నారని అసలు దొంగ కేసీఆర్ నా లేక ఆంధ్ర నాయకుల అని ప్రశ్నించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సోమవారం మియాపూర్ అల్వీన్ కాలనీ ఎక్స్ రోడ్డులో ఆపార్టీ నాయకులు మొవ్వా సత్యనారాయణ, కొరడాల నరేష్, ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతింటుందని, ఎక్కడ చూసినా అభివృద్ధి పేరునా కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పరిస్థితులు మారలేదని, గతంలోకంటే ఇంకా ఎక్కువగా దోపిడీ జరుగుతుందని, అప్పుడు ఆంధ్రుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు.

శేరిలింగంపల్లిలో ఎక్కడ లేని అభివృద్ధి జరిగిందని చెబుతున్న కేటీఆర్ కేవలం హైటెక్ సిటీ చుట్టూ జరిగితే అభివృద్ధి కాదని, ఓసారి హఫీజ్ పేట్ పరిసరాల్లో తిరిగితే తెలుస్తుందని, స్వయంగా కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్ నగర్ ను కూడా ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీఆర్ ఎస్ కు బీజేపీనే సరైన పోటీదారు అని గుర్తించిన కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పార్టీ మారుతున్నారని, పార్టీలో నాయకుల మధ్య ఐక్యత లేదని ప్రాపగండా సృష్టించి అయోమయం సృష్టించాలని చూశారని కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీల ద్వారానే పోరాటం చేస్తామని, బలమైన ఆపొజిషన్ కాంగ్రెస్ అనిచెబుతున్న కేసీఆర్ అసలు బలమైన బీజేపీని తక్కువ చేసేలా ప్రయత్నం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అన్నారు. శేరిలింగంపల్లిలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మొవ్వా సత్యనారాయణ, కొరడాల నరేష్, రవికుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు రామరాజు, నవతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed