మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన దళిత సంఘాలు

by Julakanti Pallavi |
మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన దళిత సంఘాలు
X

దిశ, ఖైరతాబాద్: ఈ నెల ఆగస్టు 18 న మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువతి కామ్రేడ్ రాధ అలియాస్ నిల్సొ హత్యను ఖండిస్తూ గురువారం వివిధ దళిత సంఘాలు రౌండ్ టేబుల్ చర్చ సమావేశాలు జరిపారు. ఈ చర్చలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక ప్రజలను చంపడం దారుణమన్నారు. అతి చిన్న వయస్సులో కుల వివక్షతలను నిర్మూలిద్దామని, ఉద్యమ బాట పట్టిన రాధ చివరికి దళంలో ఆ కుల వివక్షకే బలైపోయిందనన్నారు. ఉద్యమానికి ఎంతో సేవ చేసిన రాధ చివరికి ఆ కుహనా ఉద్యమ కారుల చేతిలోనే దారుణ హత్యకు గురైందని తెలిపారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. పొద్దున లేస్తే పౌర హక్కుల గురించి మాట్లాడే పౌర హక్కుల సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మావోలు చేసే హత్యలు హత్యలు కావా, మావోలు చేసినంత మాత్రాన అవి పవిత్ర హత్యలుగా మారిపోతాయా అని ప్రశ్నించారు. హత్య మావోయిస్టులు చేసి అందుకు బాధ్యత పోలీసులు వహించాలనడం హాస్యాస్పదమన్నారు.

డాక్టర్ వంశి తిలక్ మాట్లాడుతూ మావోయిజం ఫెయిల్ అయిపోయిందని అందుకే ఇలా ప్రజలని భయాందోళనకు గురి చేయడానికి హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికైనా రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యమే దిక్కని అన్నారు. ఇందులో ఏవో అనుమానాస్పద కుట్ర దాగుందని వక్తలు అభిప్రాయ పడ్డారు. అసలు ఒక దళిత సోదరిని ఇలా అన్యాయంగా చంపే హక్కు మావోలకు ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు. సోదరి దిశా, నిర్భయ మరియు బెంగాల్ డాక్టర్ విషయంలో స్పందించిన రీతిలో సోదరి రాధ విషయంలో కూడా సమాజం స్పందించాలని కోరారు. ఈ సమావేశం లో వివిధ దళిత సంఘాలు పాల్గొని వాళ్ల ఆవేశాన్ని వెలిబుచ్చారు.

Advertisement

Next Story

Most Viewed