చిక్కడు..దొరకడు..అధికారులకు అందుబాటులో ఉండని కమిషనర్

by samatah |
చిక్కడు..దొరకడు..అధికారులకు అందుబాటులో ఉండని కమిషనర్
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలోని సుమారు కోటిన్నర మందికి అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ కమిషనర్ పనితీరు చిక్కడు..దొరకడు అన్నట్టు తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆయన ఎప్పుడు ఎక్కడికెళ్తున్నారో కనీసం అధికారులకు కూడా సమాచారం ఉండటం లేదు. ముఖ్యంగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కమిషనర్ సందర్శకులను కలవాల్సి ఉండగా, ఆ సమయాన్ని కాస్త నాలుగు నుంచి ఐదు గంటలుగా కుదించారు. ఒక వేళ అందుబాటులో ఉన్నా సామాన్య సందర్శకులను కలిసేందుకు అనుమతించరు. కమిషనర్‌ను కలిసేందుకు వచ్చే జోనల్, వివిధ సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు ప్రధాన కార్యాలయానికి వచ్చినా, ఆయన అందుబాటులో ఉండటం లేదంటూ కొందరు జోనల్, డిప్యూటీ కమిషనర్లు బేజారవుతున్నారు. మరి కొందరికి ఫలానా రోజున రమ్మంటూ సమయమిచ్చి, ఆ రోజు కమిషనర్ అందుబాటులో ఉండకపోవటంతో వివిధ స్థాయిల్లోని అధికారులు తీవ్ర అసహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్నాం 3గంటల తర్వాత కమిషనర్‌కు వినతులు, ఫిర్యాదులను సమర్పించేందుకు వచ్చే సాధారణ సందర్శకులకు సైతం అందుబాటులో లేకపోవటంతో వారు అసంతృప్తితో ఇంటిముఖం పడుతున్నారు. ప్రజలకు అందుబాటు లేని కమిషనర్ ఎవరి కోసం పని చేస్తున్నారోనని ప్రశ్నిస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి కార్యక్రమాలకు, సమీక్షలకు, పర్యటనలకు హాజరయ్యేందుకేనా కమిషనర్ ఉన్నదీ అంటూ మండిపడుతున్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు నిత్యం పాలకుల చుట్టూ తిరుగుతూ, వారి సేవలో తరించటం కరెక్టేనా? అంటూ సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రజావాణి పట్టదా? లేక మినహాయింపా?

అన్ని సర్కారు ఆఫీసుల్లో మళ్లీ ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్దరించినా జీహెచ్ఎంసీకి మాత్రం ప్రజలవాణీ పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించేందుకు కలెక్టరేట్ కూడా సిద్దమైనా జీహెచ్ఎంసీలో ఇంకా అతీగతీలేదు. పైగా ప్రజలతో ఎన్నుకోబడిన పాలకమండలి అందుబాటులో ఉన్నా, ప్రజావాణి నిర్వహించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణి నిర్వహిస్తామంటూ మేయర్ వరుసగా తన ప్రమాణ స్వీకారోత్సవ రోజున చెబుతున్నా, ఇప్పటి వరకు అతీగతీలేదంటే, ప్రజలు, ప్రజల సమస్యలపై పాలకమండలికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అంచనా వేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed