చార్మినార్​ వద్ద గణనాథులకు పూలతో స్వాగతం పలుకుతున్న ప్రముఖులు

by Aamani |
చార్మినార్​ వద్ద గణనాథులకు పూలతో స్వాగతం పలుకుతున్న ప్రముఖులు
X

దిశ, చార్మినార్​ : సన్నాయి మేళాలు,భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, ఆర్కెస్ట్రా, భజనలు,విచిత్ర వేషధారణలు,ఒకరిపై ఒకరు గులాల్​ చల్లుకుంటూ, భక్తుల నృత్యాల నడుమ మంగళవారం పాతబస్తీ సామూహిక వినాయక నిమజ్జన ఊరేగింపు కన్నులపండువగా కొనసాగుతుంది. చార్మినార్ వద్ద భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్​, స్వామి దీపాంకర్​ మహరాజ్, భాగ్యనగర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్దన్​ రెడ్డి, కార్యదర్శి శశిధర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని, వినాయకులకు పూలతో స్వాగతం పలికారు.

దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో ప్రధాన ఊరేగింపుతో పాటు సున్నిత ప్రాంతాల్లో భారీ పోలీసు​ బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా పాతబస్తీలో జరిగిన సామూహిక ఊరేగింపు హిందువుల ఐక్యతను చాటింది. పేద, ధనిక, కుల మత, బేధాలకు తావు లేకుండా శాంతి సామర్యాన్ని ఫరిడవిల్లచేసింది. వేలాది మంది భక్త జన సందోహం నడుమ నిమజ్జనానికి బయలుదేరి పాతబస్తీలో కొలువుదీరిన గణనాథునికి దారి పొడవున నీరాజనాలు పలికారు. పాతబస్తీలో పండుగల సమయంలో ఏకతాటిపైకి వచ్చే హిందువులందరూ వినాయక ఊరేగింపు సందర్భంగా తమ ఐక్యమత్యాన్ని మరోసారి చాటిచెప్పారు. వైభవంగా సాగిన ఊరేగింపు ఆటపాటలతో డప్పు నృత్యాలతో వైభవంగా సాగింది. వివిధ పార్టీల నాయకులు , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బీజేపీ , ఆర్​ఎస్​ ఎస్​, వీహెచ్​పీ తో పాటు ఎంఐఎం పార్టీ నాయకులు సైతం ఊరేగింపుగా వస్తున్న వినాయకులకు దారి పొడవునా స్వాగతం పలికారు. వివిధ ఆకృతులతో భారీ సుందరంగా ముస్తాబు చేసిన శకటాలపై ప్రతిష్ఠించిన గణనాథులను భక్తి శ్రద్దలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

పాతబస్తీలోని వివిధ ప్రాంతాలలో ప్రతిష్ఠించిన గణనాథుల ఊరేగింపు మంగళవారం ఉదయం నుంచి మందకొడిగా సాగింది. సాయంత్రం 4గంటల సమయంలో గణనాథులను వాహనాలపై ఎక్కించి సామూహిక ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు పూలతో స్వాగతం పలికారు. సుల్తాన్​ షాహీ, బేళా, హరిబౌళి, నాగుల్​ చింత, గౌలిపురా, లలితాబాగ్​, ఉప్పుగూడ, సాయిబాబా నగర్, అరుంధతి కాలలి, కందికల్​ గేట్​, చాంద్రాయణగుట్టల మీదుగా తరలి వచ్చిన గణనాథులు లాల్​దర్వాజా మోడ్​కు చేరుకున్నాయి. అలాగే చాంద్రాయణగుట్ట నుంచి కందికల్​గేట్​ ఫ్లైఓవర్​ బ్రిడ్జి, చత్రినాక, లాల్​దర్వాజా మీదుగా లాల్​దర్వజా మోడ్​కు చేరుకుంది. ఫలక్​నుమా నుంచి జంగమ్మెట్​, రవీంద్రనాయక్​నగర్​ కాలనీ,శంషీర్​గంజ్​, అలియాబాద్​, మేకల్​ బండ, సయ్యద్​ ఆలీ చబుత్రల మీదుగా లాల్​దర్వాజా మోడ్​కు చేరుకుంది. లాల్​దర్వాజా మోడ్​ వద్ద నలువైపులా వచ్చిన గణనాథులు సామూహిక ఊరేగింపులో చార్మినార్​ మీదుగా ట్యాంక్​ బండ్​కు తరలి వెళ్లారు.

చార్మినార్​ భాగ్యనగర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో..

చారిత్రాత్మక చార్మినార్​ వద్ద భాగ్యనగర్​ గణేష్​ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ,కేంద్ర మంత్రి బండి సంజయ్, దీపాంకర్​ మహరాజ్​, భాగ్యనగర్​ గణేష్​ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్​ రెడ్డి, కార్యదర్శి శశిధర్​ తదితరులు గణనాథులకు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. చార్మినార్​ మక్కా మసీదు సమీపంలో మజ్లిస్​ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద మహమ్మద్ గౌస్, ప్రమోద్​జైన్​లు గణనాథులకు స్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed