Collector : తన మార్కు పాలన మొదలుపెట్టిన కలెక్టర్..

by Sumithra |
Collector : తన మార్కు పాలన మొదలుపెట్టిన కలెక్టర్..
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లాలో కలెక్టర్ గా ( Collector ) భాద్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే ప్రతి పనిలోనూ తన మార్క్ ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. సమీక్షలు సమావేశాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన, వివిధ మండలాలలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, అంగన్ వాడి సెంటర్లను, పల్లె దవాఖానలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. తన మార్క్ పాలన కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పై ( Collector Tejas Nandalal Pawar ) దిశ ప్రత్యేక కథనం..

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని, జిల్లా స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ అందరం టీమ్ గా పని చేసి.. జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలులో ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరవేద్దామని సూచిస్తున్నారు. జూన్ 16వ తారీఖున సూర్యాపేట జిల్లా 7వ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్ నందలాల్ పవార్ 2018 ఐఏఎస్ బ్యాచ్ చెందినవారు. స్వస్థలం మహారాష్ట్రకు చెందినవారు. గతంలో మహబూబ్నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా, అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించి అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి బదిలీ పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. తన మార్క్ పాలన కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారిగా చేయాల్సిన పనులను తప్పకుండా చేస్తానని నమ్మకం కల్పిస్తున్నారు. వివిధ శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు.

వరుస సమీక్షా సమావేశాలు..

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం డిపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ప్రెసిడెంట్, సెక్రటరీలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు, అదేవిధంగా గ్రామపంచాయతీలను నిరంతరం తనిఖీలు చేపట్టాలని, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్ల ఏర్పాటు, గ్రామపంచాయతీలో సమస్యల పట్ల దృష్టి సారించాలని వాటర్ శుభ్రం చేయాలని జిల్లాలో గల 475 గ్రామపంచాయతీలను ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో లు, ఎంపీవో లు పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేపట్టాలని, జిల్లాలో రైతులకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా రైతులకు మెరుగైన సేవలు అందించాలని వ్యవసాయ అధికారులకు సూచించి కలెక్టర్ స్వయంగా ఎరువుల దుకాణాలను పరిశీలించారు.

జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ప్రణాళికతో పారదర్శకంగా పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామంలో చేరాలని అలాగే చేపట్టిన పనులు, చేపట్టవలసిన పనుల పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కరించాలని సూచిస్తున్నారు. ప్రతి అధికారి, గ్రామ స్థాయి సిబ్బంది, పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, ప్రతి పనిలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలియజేస్తున్నారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తప్పక అమలు చేయాలని తెలియజేస్తూ ధరణి సమస్య పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు .

ఆకస్మిక తనిఖీలు..

కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, మండలాలలోని ప్రభుత్వ హాస్పిటల్స్ ను, అంగన్వాడి సెంటర్లను, ప్రభుత్వ పాఠశాలలను, నర్సరీలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. సాధారణ కాన్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఆసుపత్రిలో రోగులకు మంచి నాణ్యమైన వైద్యం అందాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆసుపత్రిలో వచ్చిన రోగులను కలెక్టర్ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా హాస్పిటల్ లో ఐసీయూలో బెడ్స్, డ్రగ్స్ అలాగే నిరంతరం శానిటేషన్ చేపట్టాలని అలాగే ప్రసూతి కోసం వచ్చే గర్భిణీలకు ఎక్కువగా సాధారణ కాన్పులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఆసుపత్రులలో ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోని జనరల్ క్యాజువాలిటి, ఆర్థో వార్డులను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్యం సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యల పైన ప్రధానంగా దృష్టి సారించి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని పాఠశాలకు, గురుకులాలను వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, మధ్యాహ్నం భోజనాలను విద్యార్థులకు అందించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం విశేషం. అంగన్ వాడి సెంటర్లను పరిశీలిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్లో అధికారులు సమయపాలన పాటించాలని బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

రైతుల పై ప్రత్యేక దృష్టి..

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు 1,50,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేశారు. బ్యాంకులో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆకస్మికంగా బ్యాంకులను కూడా సందర్శిస్తూ రైతుల బాధ తెలుసుకుంటున్నారు. రైతులను యిబ్బందులకు గురి చేయవద్దని బ్యాంకు ఉద్యోగులకు సూచిస్తున్నారు. రైతులకు ఇబ్బంది కలిగించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేశారు. ఇలా కలెక్టర్ అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు..

Advertisement

Next Story