డబుల్ ఇంజన్​ సర్కార్​ ​వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలి : ఎంపీ లక్ష్మణ్​

by Ramesh Goud |
డబుల్ ఇంజన్​ సర్కార్​ ​వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలి : ఎంపీ లక్ష్మణ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేసి, బూత్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ సూచించారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సాహసోపేత, సానుకూల నిర్ణయాల గురించి ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పతాకం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా గొప్ప ఉద్దేశంతో, లక్ష్యంతో పార్టీని స్థాపించారు. నరేంద్ర మోడీ అదే సిద్ధాంతాలు, లక్ష్యాలకు కట్టుబడి పాలన అందిస్తున్నారని తెలిపారు.

రాముడు జన్మించిన భూమి అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకున్నాం. మూడోసారి ప్రధానిగా మోడీ గెలిచిన తర్వాత, ఇతర పార్టీల అజెండాలతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. మొదటి పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదం పొందిందని ఈ వక్ఫ్ బిల్లు చారిత్రాత్మకమైన ఘట్టంగా అభివర్ణించారు. ముస్లింలలోని పేద వర్గాలకు, ముఖ్యంగా పస్మందా ముస్లింలకు న్యాయం జరగాలని, వక్ఫ్ ఆస్తుల ద్వారా మేలు జరగాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందన్నారు. ఈ వక్ఫ్ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో లక్షలాది మంది అభిప్రాయాలను స్వీకరించింది.

పార్టీ ఆవిర్భావం ఏ లక్ష్యంతో జరిగింది అనేది గుర్తు చేసుకుంటూ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, లాల్ కృష్ణ అద్వాణీ చూసిన కలలను మోడీ పాలన ద్వారా సాకారం చేస్తున్నట్లు చెప్పారు.వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో మోడీ నాయకత్వాన్ని ప్రజలు మెచ్చి, బీజేపీకి విజయాలు అందిస్తున్నారు. దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా దక్షిణాదిలో బీజేపీని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిందన్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ గెలిచి అజేయంగా నిలిచింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిరహిత, కుటుంబరహిత పాలన ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నాయి. అలాంటి కుట్రలను భగ్నం చేస్తూ, అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై బీజేపీ జెండాను ఎగురవేసి, ప్రతి మండలంలో వేడుకలు నిర్వహించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు.

Next Story

Most Viewed