- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దిశ’ ఎఫెక్ట్.. విత్తన కంపెనీ కబంధహస్తాల నుండి మార్కెట్ యార్డ్‌కు విముక్తి

దిశ, వైరా : కార్తికేయ ఆడ మగ మొక్కజొన్న విత్తన కంపెనీ కబంధహస్తాల నుండి వైరా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు ఎట్టకేలకు విముక్తి కలిగింది. గత 23 రోజులుగా మార్కెట్ యార్డును ఆక్రమించి ఐదు కవర్ షేడ్స్ తో పాటు యార్డ్ ఆవరణ మొత్తం మొక్కజొన్న కంకులను నిల్వ చేశారు. దీంతో స్థానిక రైతులు ధాన్యం ఆరుబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఈనెల 9వ తేదీన దిశ వెబ్సైట్ లో, 10వ తేదీన దిశ దినపత్రికలో " విత్తన కంపెనీ కబందాస్తాల్లో వైరా మార్కెట్ యార్డ్" అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్త కథనాలతో స్పందించిన డీఎంఓ ఎంఏ అలీమ్ వెంటనే మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కంకులను ఖాళీ చేయించాలని వైరా మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారికి డీఎంఓ ఇచ్చిన వివరణలో రైతులే మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నలను ఆరబెట్టుకున్నారని స్పష్టం చేశారు.
పనిలో పనిగా దిశ పత్రికలో వచ్చిన వార్త కథనం అవాస్తవమని తన అక్కసును వెళ్లగక్కారు. అయితే దిశలో వచ్చిన వార్త కథనం అక్షర సత్యమని, మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్న కంకులు కార్తికేయ కంపెనీకి సంబంధించినవని నిరూపిస్తామని దిశ సవాల్ విసిరింది. అందుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన దిశ వెబ్సైట్ లో, 11వ తేదీన దిశ దినపత్రికలో "ఆ మొక్కజొన్నలతో రైతులకు సంబంధం ఏంటి...?" అనే వార్త కథనం ప్రచురించింది. దీంతో ఉలిక్కిపడిన మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ యార్డ్ లోని మొక్కజొన్న కంకులను ఖాళీ చేయించారు. ఒక దశలో మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న కంకులను ఆరబోయించిన దళారులకు ఓ ప్రజాప్రతినిధి అండ ఉందని ప్రచారం జరిగింది.
ఈ మేరకు సదరు ప్రజా ప్రతినిధి మార్కెట్ అధికారులకు ఫోన్ చేసి మీకేం కాదు మీకేమైనా అయితే నేను చూసుకుంటానని మార్కెట్ అధికారులకు అభయం ఇచ్చినట్లు తెలిసింది. అయితే దిశలో వరుస వార్త కథనాలు రావడంతో ఎట్టకేలకు యార్డులోని కవర్ షెడ్లు, ఆవరణలో ఉన్న మొక్కజొన్న కంకులను ఖాళీ చేసి లారీల ద్వారా ఎగుమతి చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల కల్లా మొక్కజొన్న కంకులను మార్కెట్ యార్డ్ నుంచి కార్తికేయ విత్తనోత్పత్తి కంపెనీ ఉన్న ప్రాంతాలకు తరలించారు.