దాడుల మాటున దందా.. ఫుడ్ సేఫ్టీ దాడులు ఉత్తుత్తేనా..?

by Satheesh |
దాడుల మాటున దందా.. ఫుడ్ సేఫ్టీ దాడులు ఉత్తుత్తేనా..?
X

దిశ, సిటీబ్యూరో: ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో దాడుల మాటున అమ్యామ్యాల దందా జరుగుతుందా..? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. జీహెచ్ఎంసీలో నాలుగేళ్ల క్రితం నియమితులైన దాదాపు 22 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఇప్పటి వరకు ఒక్క ఆహార విక్రయ కేంద్రంపై దాడులు చేసినా శ్యాంపిల్స్ సేకరించకుండా కేవలం సర్కిళ్ల వారీగా వాటి వివరాలను సిద్దం చేసి, నెలసరి మామూళ్ల బేరసారాలు కుదుర్చుకున్న తర్వాతే దాడులు చేయటం మొదలుపెట్టడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది.

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్ నగరంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లతో సమిష్టిగా నిర్వహిస్తున్న ఈ దాడులతో ఆహార విక్రయ సంస్థల నిర్వహణలో మార్పులు వస్తున్నాయా..? అంటే లేదనే చెప్పవచ్చు. దాదాపు వంద సంస్థల్లో లోపాలను గుర్తించిన అధికారులు, లోపాలు సరిచేసుకునే వరకు సంస్థలను తెరవరాదని నోటీసులు జారీ చేస్తూనే.. ఫుడ్‌సేఫ్టీ అధికారులు దందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పెరిగిన రాజకీయ ఒత్తిళ్లు..

దాడులు నిర్వహించి శ్యాంపిల్స్ సేకరించటం, నోటీసులు జారీ చేయటం వంటివి చేస్తున్న అధికారులు ఆ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అర్థరాత్రి ఒంటి గంటకు ఎక్స్‌లో పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా గత నెల రెండో వారం నుంచి విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు జూన్ 1వ తేదీ నుంచి ఆయా ఆహార సంస్థలపై చర్యలుంటాయని ప్రకటించి, ఇప్పటి వరకు ఏఒక్క సంస్థపై కఠిన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. న్యూ సిటీలోని పలు ప్రాంతాల్లో వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ, ఓల్డ్ సిటీలో దాడులు కేవలం ఒక రోజుకు కొన్ని వ్యాపార సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి.

నగరంలో పలు ఆహార విక్రయ కేంద్రాలను పలువురు ప్రజాప్రతినిధులే నిర్వహిస్తున్నందున దాడులపై క్రమంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా పెరిగాయనే విమర్శలున్నాయి. ఆహార విక్రయ కేంద్రాల నుంచి నెలసరి మామూళ్లు స్వీకరించే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి, కనిష్టంగా రూ.లక్ష జరిమానాలు విధించి చేతులు దులుపేసుకుంటున్నట్లు వాదనలున్నాయి.

కనిష్టంగా లక్ష.. గరిష్టంగా 2 లక్షలు..

జీహెచ్ఎంసీ పరిధిలోని ఆహార విక్రయ కేంద్రాలు నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించినా నిర్వాహకుడికి కనిష్టంగా రూ.లక్ష, గరిష్టంగా రూ.2 లక్షల వరకు జరి మానా విధించేలా మాత్రమే స్టేట్ ఫుడ్ సేఫ్టీ యాక్టులో ప్రొవీజన్ ఉందని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. కానీ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ యాక్టు ప్రకారం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ఉల్లఘించిన సంస్థను శాశ్వతంగా మూసివేయటంతో పాటు యజమానిని బాధ్యుడిని చేస్తూ జరిమాన విధించకుండా తిరిగి తన బిజినెస్ కార్యకలాపాలను కొనసాగించే వెసులుబాటును కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతకన్నా ఎక్కువేం చేయలేం..

మహానగరంలో గడిచిన నెలన్నర రోజుల నుంచి ఫుడ్ ఎస్టాబ్లి ష్‌మెంట్లపై మెరుపుదాడులు నిర్వహించిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చిన్నచిన్న జరిమానాలు విధించటం, కిచెన్‌‌ను ఆధునీకరించుకుంటామంటూ డిక్లరేషన్లు తీసుకుని ఆహార విక్రయ కేంద్రాలను మళ్లీ దందాకు అనుమతిస్తున్నారు. ఆహార విక్రయ కేంద్రాలపై తూతూమంత్రంగా చర్యలు, కొంత జరిమానాలు విధించి తిరిగి అనుమతిస్తున్నట్లు సమాచారం.

అధికారులకు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కిచెన్‌ను తీర్చిదిద్దకుండా, అందుకయ్యే ఖర్చులో కొంత మీకే చెల్లిస్తామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అమ్యామ్యాలుగా చెల్లించి, కేసును మేనేజ్ చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతటి భయంకరమైన లోపాలు బయటపడిన ఆహార సంస్థలను ఇంత సులభంగా ఎలా పునరుద్దరిస్తారని ప్రశ్నిస్తే చట్టంలో ఇంతవరకు మాత్రమే చేయాలని ఉంది. అంతకన్నా ఎక్కువేం చేయలేమంటూ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story