పోస్టులన్నీ ఆయనకే..మండిపడుతున్న సీనియర్ ఇంజినీర్లు

by Aamani |
పోస్టులన్నీ ఆయనకే..మండిపడుతున్న సీనియర్ ఇంజినీర్లు
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో పోస్టులన్నీ కొంత మంది వద్దనే కేంద్రీకృతమై ఉన్నాయి. కొన్ని విభాగాల్లో సిబ్బంది లేకపోవడంతో అదనపు పోస్టులు ఉండడం ఒకెత్తయితే, కొన్ని విభాగాల్లో అధికారులున్నా కొందరికే అదనపు పోస్టులు కట్టబెట్టారు. అందుకు రాజకీయపలుకుబడినే కారణమని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఇంజనీరింగ్ విభాగమే నిదర్శనం. కొంతమందికి ఎక్కువ పోస్టులు ఇవ్వడంపై సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు మండిపడుతున్నారు.

5 సీఈ పోస్టులు..

ఎస్ఎన్డీపీ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా పనిచేసిన ఎస్.భాస్కర్ రెడ్డి కి అదనంగా 5 చీఫ్ ఇంజినీర్ పోస్టులను కట్టబెట్టారు. ఈఎన్‌సీ, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టు)గా పనిచేసిన దేవానంద్ రిటైర్డ్ కావడంతో రెండు పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. దీంతో ఎస్ఎన్డీపీ ఎస్ఈగా పనిచేస్తూనే చీఫ్ ఇంజినీర్(నిర్వహణ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవానంద్ రిటైర్డ్ కావడంతో చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టు), చీఫ్ ఇంజనీర్(లేక్స్), చీఫ్ ఇంజనీర్(హౌసింగ్), చీఫ్ ఇంజినీర్(అడ్మిన్) పోస్టులన్నీ ఒకే వ్యక్తికి అప్పగించారు. 5 పోస్టులను ఒకే వ్యక్తికి అప్పగించడంపై పలువురు సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ ఉన్న తమకు పోస్టులివ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఐఏఎస్ అధికారి అనురాజ్ జయంతికి సైతం 5 పోస్టులు ఉన్నాయి. ఐటీ, రెవెన్యూ విభాగాలతో పాటు ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టు, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, కుడా ఇన్‌చార్జిగా ఉన్నారు. ఒక వ్యక్తికి ఐదేసి పోస్టులు ఉండడంతో ఏ పోస్టుకు న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది.

4 ఎస్ఈ పోస్టులు..

ఓ అధికారికి 5 చీఫ్ ఇంజినీర్ పోస్టులు ఇస్తే..మరో అధికారికి 4 సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) పోస్టులు కట్టబెట్టడంపై పలువురు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు మండిపడుతున్నారు. ప్రాజెక్టు విభాగంలో శ్రీలక్ష్మి సెంట్రల్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఎస్ఈగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ విషయంపై సదరు అధికారిని అడిగితే ‘ఏముంటుందండి..పేపర్ వర్కే కదా’ అంటూ సింపుల్‌గా సమాధానమిచ్చారు. దీంతో పాటు ఒకే వ్యక్తికి 4 ఎస్ఈ పోస్టులుండడంపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోస్టింగ్ కూడా మార్చాలని సంబంధిత అధికారిని ఆదేశించినా ఫలితం లేకుండపోయిందని పలువురు ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ ఇంజనీరింగ్ అధికారి మాట్లాడుతూ ‘ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ వివక్షకు గురికాక తప్పడం లేదని, తమకు ప్రమోషన్లు ఎప్పుడిస్తారని, తమకు పని చేయడం చేతకాదా? ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed