రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసినా.. గ్యారెంటీలు ఎలా ప్రకటించారు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

by Shiva |   ( Updated:2024-03-17 16:46:17.0  )
రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసినా.. గ్యారెంటీలు ఎలా ప్రకటించారు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగులో మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోంది తప్పితే పూర్తిస్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు. బీజేపీ మేనిఫెస్టోలా కాకుండా ప్రజల మేనిఫెస్టోలా ఉండాలని నిర్ణయించినట్లు లక్ష్మణ్ వెల్లడించారు. కేవలం రాజకీయాల కోసం అమలు చేయలేని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని ఆయన ధ్వజమెత్తారు.

కర్ణాటకలోలో కూడా అమలుచేయలేని హామీలిచ్చిందని, నెరవేర్చలేక ప్రభుత్వం విఫలమైందన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నామమాత్రంగా పథకాలు ప్రారంభిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అప్పుల్లో కురుకుపోయేలా చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ ఆరు గ్యారెంటీలు ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఆ హామీలకు నిధులు ఎలా సమకుర్చుతారో కూడా చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలంపాటలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పథకాలు ప్రకటించాయని, ఉచితంగా పంచుకుంటూ పోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఉందన్నారు. దేశ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీకి సపోర్ట్ చేయాలని లక్ష్మణ్ కోరారు.

నేడు ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డు సమావేశం

ఢిల్లీలో సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత జరుగుతున్న మొదటి పార్లమెంటరీ బోర్డ్ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణకు సంబంధించి రెండు లోక సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిపైనా చర్చించే చాన్స్ ఉందని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న వరంగల్ లోక్ సభ స్థానం టికెట్ పార్టీలో చేరిన అరూరి రమేశ్ కు, ఖమ్మం స్థానం జలగం వెంకట్ రావుకు ఇస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story