Harish Rao: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు.. హరీశ్‌రావు సంచలన ట్వీట్

by Shiva |   ( Updated:2024-09-02 15:20:25.0  )
Harish Rao: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు.. హరీశ్‌రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఎఫ్టీఎల్ పరిధిలో ‘హైడ్రా’ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వరుసగా చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా సీఎం నిర్ణయంపై మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సమయంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ.. ఈటెల రాజేందర్ ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే సీఎంపై ప్రశంసించిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లాంటి సూడో మేధావులు రేవంత్ ఏదో గొప్ప ప్రగతి కాముకుడు, ఆయనో మేధావి, ఆయన ఓ సంస్కర్త, కేవలం ఆయన మాత్రమే తెలంగాణను రక్షించగలడు అన్నంత బిల్డప్ ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎన్-కన్వెన్షన్ ఒకటి మాత్రమే తెలుసేమో.. కానీ, చాలామంది పేదల ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని ఈటల సెటైర్లు వేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అసలు విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈటల అనుచరులు నాగేశ్వర్‌పై పెద్ద ఎత్తున టోలింగ్ చేశారు. ఆయన పర్సనల్ నెంబర్లు కాల్స్ చేస్తూ ఇబ్బందులు పెట్టారు.

అయితే, తాజాగా మొత్తం పరిణామాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. రాజకీయ విమర్శలను జవాబుగా రాజకీయ విమర్శలతోనే ఎదుర్కోవాలి. అంతేగానీ, అందుకు భిన్నంగా భౌతిక దాడులు చేస్తామని, బయట తిరగనివ్వబోమని బెదిరిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా దుర్భాషలాడటం గర్హనీయం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఈటల ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story