KTR : పేద విద్యార్థులకు గొడ్డు కారమా ? : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : పేద విద్యార్థులకు గొడ్డు కారమా ? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(Mahatma Gandhi University)లోని హాస్టల్‌(Hostel)లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు గొడ్డుకారం అన్నం పెట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్‌ భోజనం ఖర్చు 32వేలు మాత్రమే.. అదే చదువుకునే విద్యార్థులకు మాత్రం గొడ్డుకారంతో భోజనం పెడతారా అని ప్రశ్నించారు. వారెవ్వా ప్రజా పాలన.. శభాష్‌ ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎద్దేవా చేశారు.

మరో ట్వీట్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూపీలో ఇదే తరహా ఘటనపై స్పందించడాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ 2019లో ఆమె చేసిన ప్రకటనను గుర్తు చేసుకుని తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు. లేదా యూపీలో జరిగినప్పుడే దీన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తారా? వేరే రాష్ట్రంలో జరిగిన అలాగే చూస్తారా అని నిలదీశారు. ఇది తెలంగాణ కాబట్టి ఉప్పు మాత్రమే కాకుండా.. ఉప్పుతో పాటు కారం కూడా ఉండటంతో వార్తకు స్పైసీనెస్‌ తగ్గిందా? లేదా సమస్య తీవ్రత తగ్గిందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినులకు బ్రేక్‌ ఫాస్ట్‌గా అన్నంతో పాటు గొడ్డుకారం పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్‌, ఉప్పు డబ్బా పక్కనే ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఎంజీయూలో గొడ్డు కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ ఘటన వివాదంగా మారడంతో అదే హాస్టల్ విద్యార్థినులతో బ్రేక్‌ఫాస్ట్‌లో బోండా పెట్టారని, తామే కారం అన్నం అడిగామని లెటర్‌ విడుదల చేయించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాలధారణలో ఉన్నారని, చలికాలం కావడంతో కూర ఉన్నప్పటికీ కారం అడగడం వల్లే ఇచ్చామని హాస్టల్‌ సిబ్బంది వివరణతో మరో లెటర్‌ బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed