‘హఫీజ్ పేట’ భూమికి పట్టా!

by Mahesh |
‘హఫీజ్ పేట’ భూమికి పట్టా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో కొన్ని ఏరియా పేర్లు, సర్వే నెంబర్లు చెప్తే చాలు.. భూ మాఫియా ఆగడాలు, కిడ్నాప్, హత్యలు, దాడులు గుర్తుకొస్తాయి. వాటిపై జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అనేక కేసులు ఉంటాయి. అలాంటి కోవకు చెందినవే శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట ల్యాండ్స్.. ఇక్కడున్న రూ. వేల కోట్ల విలువైన భూములపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఓ భూ వ్యవహారంలో మాజీ మంత్రిని కిడ్నాప్ చేయడం గతంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి భూములపై పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఎప్పటినుంచో కన్నేశారు. వాటిని దక్కించుకునేందుకు ప్లాన్ వేశారు. బడా కంపెనీలు సైతం ల్యాండ్స్ కొనుగోలు చేశాయి. వ్యక్తులు, సంస్థల పేరిట లావాదేవీలు సైతం నడిచాయి. అయితే ఇక్కడ చాలా భూములు ఆది నుంచి సర్కారువేనంటూ రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయినా సేల్ డీడ్స్, మ్యుటేషన్లు నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా హఫీజ్ పేట లో సర్వే నెం.77 లోని 24.35 ఎకరాల క్లాసిఫికేషన్ చేంజ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. గవర్నమెంట్ నుంచి పట్టా గా మారడం పెద్ద ఎత్తున చర్చలు, అనుమానాలకు దారితీసింది.

కేసులు పెండింగులోనే..

శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేటలోని సీఎస్ 14 భూములపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్‌పీ నం.7186– 7188/2021 పై స్టేటస్ కో ఉన్నది. ఈ విషయం రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నుంచి సీఎస్ వరకు తెలుసు. అయినా కొందరు మ్యుటేషన్లు, ఎన్వోసీల కోసం దరఖాస్తులు అందజేస్తున్నట్లు తెలిసింది. సర్వే నెం.77 తో పాటు 80 లో ల్యాండ్ కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో హఠాత్తుగా సర్వే నెం.77 లోని 24.35 ఎకరాలు పట్టా గా మారడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పని చేసిన ఏ కలెక్టర్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఆఖరికి కంటెప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడేమో పట్టాదారుగా వెదిరే ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ లో మెట్ట/డ్రై గా నమోదు చేశారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో మాత్రం ఇప్పటికీ సర్వే నెం.77 ప్రభుత్వ ల్యాండ్ గా, పలు కేసులు ఉన్నట్లుగానే చూపిస్తూ నిషేధిత జాబితాలోనే కొనసాగిస్తున్నారు.

ఈ భూములన్నీ వివాదాస్పదమే

హఫీజ్ పేట సర్వే నెంబర్ 77 నుంచి 80 వరకు వివాదం నడుస్తూనే ఉంటుంది. వాటి పక్కనా అనేక చిక్కుముళ్లు. ఇక్కడ భూములు వేలం వేస్తే ఎకరం రూ.60 కోట్లకు పైగానే పలుకుతుందని అంచనా. సర్వే నెంబర్ 80 కింద 484.31 ఎకరాల భూమి ఉంటుంది. ధరణి వెబ్ సైట్ లో ఇదే సర్వే నెంబరును కొట్టి చూస్తే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంటుంది. 1968 జూన్ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ డిక్రీని పొందలేదు. ప్రిలిమినరీ డిక్రీతోనే హక్కుదారులు ఆగిపోయారు. అప్పట్లో భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ భూముల్లో ఫైనల్ డిక్రీ పొందేందుకు ప్రయత్నం చేయలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ భూములన్నీ సర్కారు వేనని ప్రభుత్వం వాదిస్తున్నది. అందుకు అనుగుణంగానే రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనూ ఈ భూములు ప్రభుత్వానివని తెలుసు. కానీ కొందరు పెద్దల కోసం మాత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని పట్టుకుని మ్యుటేషన్లు, ఎన్వోసీల కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు.

రెవెన్యూ రికార్డుల్లో..

- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట సర్వే నం.77లో 127.31 ఎకరాలు, 78లో 215.27 ఎకరాలు, 79లో 39.08 ఎకరాలు, 80లో 484.31 ఎకరాలు.. మొత్తం 567.17 సర్కారీ భూమి. ఇదంతా సీఎస్ 14/58 ల్యాండ్ గా అందరికీ తెలుసు. ప్రస్తుతం 60 శాతం స్థలంలో నిర్మాణాలు వెలిశాయి.

-ధరణి పోర్టల్ రికార్డుల్లో మాత్రం సర్వే నెం.77/పీ1లో 102.36 ఎకరాలు, 78లో 205.27 ఎకరాలు, 79లో 39.08 ఎకరాలు, 80లో 484.31 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డయ్యింది. వీటిని నిషేధిత జాబితాలో పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాల మేరకే చేశాం

హఫీజ్ పేట సర్వే నెం.77 లో క్లాసిఫికేషన్ ని కోర్టు ఆదేశాల మేరకే చేశాం. ఆ కంపెనీ వాళ్లు కొన్నేండ్ల క్రితమే మ్యుటేషన్ కి అప్లై చేశారు. రఘునందన్ రావు కలెక్టర్ గా ఉన్న సమయంలోనే కోర్టు ఆదేశాలొచ్చాయి. అప్పుడు మార్పు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. మ్యుటేషన్ చేయడం లేదంటూ మళ్లీ అప్పీల్ కి వెళ్లారు. అప్పీల్ లోనూ కోర్టు వారికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో మేం ఎస్ఎల్పీ దాఖలు చేశాం. అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పాం. అయితే హైకోర్టు డైరెక్షన్ ప్రకారం క్లాసిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే పాత కేసుల్లో తుది తీర్పు ప్రకారం నడుచుకోవాలని డైరెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు పట్టాగా మారినా సీఎస్ 14 కి సంబంధించిన కేసుల్లో వచ్చే తీర్పుల ప్రకారం మార్పులు ఉంటాయి.:- వెంకారెడ్డి, తహశీల్దార్, శేరిలింగంపల్లి

Advertisement

Next Story