సీసీ టీవీల నిఘాలో గ్రూప్-1 పరీక్షలు

by Gantepaka Srikanth |
సీసీ టీవీల నిఘాలో గ్రూప్-1 పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు 13 సంవత్సరాల కాలం తర్వాత జరుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియా వినియోగం విస్తృతమైన నేపథ్యంలో అపోహలు, పుకార్లు రాకుండా, అది అభ్యర్థులను మానసికంగా గందరగోళానికి గురిచేయకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చే పోస్టులపై సైబర్ సెల్ ప్రత్యేక నిఘా పెట్టనున్నది. ప్రతీ ఎగ్జామ్ సెంటర్‌లో, ఆ ప్రాంగణంలో సీసీటీవీలను అమర్చనున్నది. వీటన్నింటినీ టీజీపీఎస్సీ ఆఫీస్‌లోని కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయనున్నది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి నుంచి బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకునేలా ఏర్పాటు చేసిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని సమకూరుస్తున్నది. రాష్ట్రం మొత్తం మీద 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నందున హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిలాల్లో 46 ఎగ్జామ్ సెంటర్లను నెలకొల్పింది.

అభ్యర్థులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సచివాలయంలో గురువారం రివ్యూ నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మహేందర్‌రెడ్డి, సభ్యులు, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, డీజీపీ జితేందర్, దక్షిణ డిస్కం మేనేజింగ్ డైరెక్టర్ ముషార్రఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21-27 తేదీల మధ్యలో జరిగే పరీక్షల్లో ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నొక్కిచెప్పారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యక్షంగా హాజరు కాని కొందరు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సులోనూ కొన్న సూచనలు చేశారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు హాజరవుతున్నా సెంటర్లను మాత్రం హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల దగ్గర అవకతవకలు, అవాంఛనీయమైన ఘటనలు జరక్కుండా సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు నేరుగా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమీషనర్లు భద్రతా ఏర్పాట్లను చేపడతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏ విధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా పరీక్షల నిర్వహణ విధులు నిర్వహించాలని నొక్కిచెప్పారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ, 2011లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని, మళ్లీ 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎదురుచూపులు, ఆకాండ్షలు, ఆశల నేపథ్యంలో ప్రతీ అంశంలో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా ఆక్టివ్‌గా ఉండడంతో పరీక్షల నిర్వహణ సవాలుతో కూడుకుంటున్నదని అన్నారు. దీన్ని గమనంలో ఉంచుకుని ఏ విధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, ప్రతీ పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్‌లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర (1.30 గంటల) తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే, 85% మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని అదనంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు. పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమైన అభ్యర్థులు ఇప్పటికే కమిషన్‌కు తెలియజేశారని, ఆ ప్రకారం వారి హాల్ టికెట్లపైనే ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నట్లు వివరించారు. స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలు రాసేవారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.

అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు పర్యవేక్షిస్తారని దక్షిణ డిస్కం మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ వివరించారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed