అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొట్టమొదటి భారతీయుడు

by John Kora |   ( Updated:2025-01-30 18:15:52.0  )
అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొట్టమొదటి భారతీయుడు
X

- ఆక్సియమ్ మిషన్ పైలెట్‌గా శుభాన్షు శుక్లా

- మిషన్‌కు సెలెక్ట్ అయిన తొలి ఇస్రో వ్యోమగామి

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఇస్రో ఆస్ట్రనాట్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొట్ట మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్ల రికార్డులకు ఎక్కనున్నాడు. ఆక్సియమ్ మిషన్ 4 అనే ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్‌కు శుక్లా పైలెట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు నాసా గురువారం ఒక ప్రకటన వెలువరించింది. 2025 వేసవి తర్వాత ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నాడు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్న మొదటి భారతీయుడు శుభాన్షు శుక్లా కావడం విశేషం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా పని చేసిన శుభాన్షు శుక్లా.. ఇస్రో ప్లాన్ చేస్తున్న గగన్ యాన్ ప్రోగ్రాంలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈ ఆక్సియమ్ 4 మిషన్‌కు నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ కమాండర్‌గా వ్యవహరించనుండగా, పోలాండ్‌కు చెందిన స్లావోజ్స్ ఉజ్‌నాన్‌స్కి, హంగేరీకి చెందిన టైబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా వెళ్లనున్నారు. ఆక్సియమ్ స్పేస్ సంస్థ గతంలో మూడు ప్రైవేట్ ఆస్ట్రనాట్ మిషన్లను చేపట్టింది. 2022 ఏప్రిల్‌లో ఏఎక్స్-1ను లాంఛ్ చేయగా.. 17 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ఉండి వచ్చారు. 2023 మేలో ఏఎక్స్-2, 2024 జనవరిలో ఏఎక్స్-3ని విజయవంతంగా లాంఛ్ చేశారు.


Next Story

Most Viewed