థాయిలాండ్ మాస్టర్స్‌లో శ్రీకాంత్ జోరు.. క్వార్టర్ ఫైనల్‌కు అర్హత

by Harish |
థాయిలాండ్ మాస్టర్స్‌లో శ్రీకాంత్ జోరు.. క్వార్టర్ ఫైనల్‌కు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయిలాండ్ మాస్టర్స్‌లో తెలుగు కుర్రాడు, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. మెన్స్ సింగిల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 21-19 21-15 తేడాతో హాంకాంగ్ షట్లర్ జాసన్ గుణవాన్‌ను ఓడించాడు. 42 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌‌లో హాంకాంగ్ ప్లేయర్ పోటీనిచ్చినప్పటికీ శ్రీకాంత్ తన అనుభవంతో దూకుడు ప్రదర్శించి రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. గుణవాన్‌పై శ్రీకాంత్‌కు ఇది రెండో విజయం. క్వార్టర్ ఫైనల్‌లో అతను చైనా షట్లర్ వాంగ్‌తో తలపడనున్నాడు. మరోవైపు, యువ ప్లేయర్ ఎస్.సుబ్రమణియన్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో అతను ఇండోనేషియాకు చెందిన చికో ఔరా ద్వి వార్డోయో‌పై పోరాడి గెలిచాడు. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత బలంగా పుంజుకున్న సుబ్రమణియన్ 9-21, 21-10, 21-17 తేడాతో విజయం సాధించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో రక్షిత శ్రీ కూడా ముందడుగు వేసింది. రెండో రౌండ్‌‌‌లో చైనీస్ తైపీ షట్లర్ టుంగ్ టోంగ్‌పై 15-21, 12-21 తేడాతో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జంట రోహన్ కపూర్-రుత్విక 19-21, 15-21 తేడాతో రట్చాపోల్ మక్కాసాసిథోర్న్-నట్టమాన్ లైసుమన్(థాయిలాండ్) చేతిలో పరాజయం పాలై రెండో రౌండ్‌లో నిష్ర్కమించింది.



Next Story

Most Viewed