మళ్లీ ‘లిక్కర్’ పాలిటిక్స్.. ఢిల్లీ అసెంబ్లీలో చర్చ.. తెలంగాణలో రియాక్షన్?

by Mahesh Kanagandla |
మళ్లీ ‘లిక్కర్’ పాలిటిక్స్.. ఢిల్లీ అసెంబ్లీలో చర్చ.. తెలంగాణలో రియాక్షన్?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం లిక్కర్ కేసు తేనెతుట్టెను కదిలించనున్నారు. మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసుపై రాజకీయ దుమారం రేగనుంది. ఆప్ అధికారంలో ఉండగా తొక్కిపట్టిన కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడుతామని తొలి కేబినెట్ భేటీలోనే సీఎం రేఖా గుప్తా టీమ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న కాగ్ నివేదికలు ప్రవేశపెడుతామని కాబోయే స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా శుక్రవారం వెల్లడించారు. ఆ నివేదికలపై చర్చ చేపడుతామనీ పేర్కొన్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ మాత్రం సమయం వృథా చేయకుండా పకడ్బందీగా ఆప్‌పై దాడికి సిద్ధమవుతున్నది. దీంతో మరోసారి రాజకీయ తెరమీదికి ఢిల్లీ లిక్కర్ కేసు రానున్నదని, ఢిల్లీతోపాటు తెలంగాణకూ ఆ ప్రకంపనలు తాకనున్నట్టు చెబుతున్నారు. ఇంకోవైపు అవినీతిపరులను, ప్రజల సొమ్ము దోచుకున్నవారిని విడిచిపెట్టబోమని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ దుశ్యంత్ గౌతమ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ కూడా కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ దేశాన్ని దోచుకున్నవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దీంతో కాగ్ నివేదికల్లో లిక్కర్ పాలసీ అంశం కేంద్రంగా ఆప్‌పై బీజేపీ ప్రభుత్వం విరుచుకుపడే అవకాశాలున్నాయి.

తొలి ఎజెండా అదే..

ఈ నెల 24, 25, 27 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా తెలిపారు. తొలి రోజున 70 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం తీసుకుంటారని, ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వివరించారు. 25న కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నివేదికలు స్పీకర్ కార్యాలయానికి అందాయని చెప్పారు. కాబట్టి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికవ్వగానే కాగ్ నివేదికలను ప్రవేశపెట్టి.. వాటిపై చర్చ పెట్టడమే తొలి ఎజెండాగా ఉన్నదని వివరించారు.

కాగ్ లీక్ రిపోర్టులో ఏముంది?

కాగ్ నివేదికలను ఆప్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఈ నివేదికలను పేర్కొంటూ బీజేపీ కేజ్రీవాల్ పై విరుచుకుపడింది. కేజ్రీవాల్ మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, కాగ్ నివేదికల్లో ఇదే ఉన్నదని ఎన్నికలకు ముందే జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. మీడియాలోనూ ఈ స్కీం వల్ల రూ. 2,026 కోట్ల నష్టం వాటిల్లినట్టు కథనాలు వచ్చాయి. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. మద్యం పాలసీ లక్ష్యం తప్పిందని, ఈ విధానం అమల్లోకి తెచ్చి ఆప్ మనీలాండరింగ్ ద్వారా కోట్ల డబ్బులు అందిపుచ్చుకుంది. పాలసీ విధానంలోనూ అవకతవకలు జరిగాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నేతృత్వంలోని మంత్రిమండలి గాలికొదిలేసింది. ఫిర్యాదులున్న, ఆర్థిక స్తోమత లేని బిడ్డర్లకూ రాజధానిలో మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్‌లు జారీ చేసింది. ఈ జారీ ప్రక్రియలో బిడ్డర్లను సమగ్రంగా పరిశీలించలేదు. నష్టాల్లో ఉన్న.. అనుమానాస్పద రీతిలో లైసెన్స్‌లు రెనివల్ చేసుకున్న వారికీ లైసెన్స్‌లు జారీ చేశారు. ఈ ఉల్లంఘనులనూ ఉద్దేశపూర్వకంగా శిక్షించలేదు. పాలసీలో ముఖ్యమైన నిర్ణయాలను కేబినెట్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే అమలు చేశారు. ఆ కొత్త నిబంధనలు రేటిఫికేషన్ కోసం అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టకుండా మొత్తం అధికారిక ప్రక్రియనే తుంగలో తొక్కారు. ఈ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 2,026 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఆ లీక్ రిపోర్టులో ఉన్నట్టు కథనాలు వచ్చాయి.

మద్యం పాలసీ.. సౌత్ గ్రూప్ ఆరోపణలు

2021 నవంబర్‌లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని ఆప్ ప్రభుత్వం తెచ్చింది. ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ ఉల్లంఘనలు గుర్తించి ఎల్జీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన దర్యాప్తును సీబీఐని ఆదేశించారు. ఆ తర్వాత మనీలాండరింగ్ కోణం బయటపడటంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. దర్యాప్తు వేగంగా సాగింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు కీలక నేతలు అరెస్టయ్యారు. తర్వాత కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా పలువురు బెయిల్ పై విడుదలయ్యారు. ఈ పాలసీ కంటే ముందు ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం రిటైల్‌గా విక్రయించేది. కానీ, లిక్కర్ రిటైల్ ట్రేడింగ్‌లో గేమ్ చేంజర్‌గా పేర్కొంటూ ఈ పాలసీని అప్పటి ప్రభుత్వం తెచ్చింది. కొందరికి లైసెన్స్‌లు అంది.. పెంచిన 12 శాతం మార్జిన్‌ల నుంచి సగం ఆప్ పార్టీకి అందేలా పకడ్బందీగా పాలసీలో లోపాలు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఆ లైసెన్స్‌లు పొందే వారి నుంచే మనీలాండరింగ్ ద్వారా ఆప్ డబ్బు పొందిందని, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆ డబ్బులు ఖర్చు పెట్టిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. సుమారు రూ. 580 కోట్ల స్కామ్‌గా దీన్ని పేర్కొన్నారు. ఒక లిక్కర్ కార్టెల్ ఏర్పడి.. వాటికి లైసెన్స్‌లు అప్పజెప్పి వాటి నుంచి డబ్బులు పొందేలా ప్రీప్లాన్‌గా ఈ పాలసీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ కార్టెలే సౌత్ గ్రూప్ అని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా నిందితురాలిగా తేలడంతో తెలంగాణలోనూ ఈ కేసు చర్చనీయాంశమైంది. సౌత్ గ్రూప్‌లో ఆమె కీలక సభ్యురాలని, ఆప్‌కు డబ్బులు అందడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. తిహార్ జైలుకు వెళ్లిన ఆమెను సీబీఐ, ఈడీ పలుమార్లు విచారించింది. సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 27న ఆమెకు బెయిల్ మంజూరు చేయగా విడుదలైన ఆమె.. తనను కుట్రపూరితంగా జైలుకు పంపినవారికి మిత్తితో సహా వడ్డిస్తానని హెచ్చరించారు.

Next Story