Israel: ఖైదీల విడుదలలో ఇజ్రాయెల్ జాప్యం.. కాల్పుల విరమణలో ట్విస్ట్

by vinod kumar |
Israel: ఖైదీల విడుదలలో ఇజ్రాయెల్ జాప్యం.. కాల్పుల విరమణలో ట్విస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒప్పందం ప్రకారం హమాస్ గురువారం 8 మంది బందీలను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు ఇజ్రాయెలీలు, ఐదుగురు థాయ్ లాండ్ పౌరులు ఉన్నారు. అయితే దీనికి బదులుగా 110 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉండగా జాప్యం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని నెతన్యాహు కీలక ఆదేశాలు జారీ చేశారు. బందీల విడుదల సమయంలో జనాలు వారి మీదకు ఎగపడ్డారని, ఈ దృశ్యం తీవ్ర దిగ్ర్బాంతి కలిగించిదని తెలిపారు. ‘మా బందీలను విడుదల చేసే టైంలో షాకింగ్ సన్నివేశాలను చూస్తున్నాను. హమాస్ ఉగ్రవాద సంస్థ అనూహ్యమైన క్రూరత్వానికి ఇది నిదర్శనం. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు పునరావృతం కాకుండా మధ్యవర్తులు హామీ ఇవ్వాలి. మా బందీలకు రక్షణ కల్పించాలి. బందీలకు హాని చేయడానికి ఎవరు ధైర్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. మధ్య వర్తులు దీనిపై హామీ ఇచ్చే వరకు ఖైదీలను విడిచిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలస్తీనా ఖైదీలను గాజాకు తీసుకెళ్లే వాహనాలు జైళ్లకు తిరిగి వచ్చాయి. అంతకుముందు ఖాన్ యూనిస్ నగరంలో రెడ్ క్రాస్ సంస్థకు బందీలను అప్పగించేప్పుడు అనేక మంది ప్రజలు బందీలను చుట్టుముట్టారు. దీంతో శిథిలాల నుంచి బందీలను నడిపించి రెడ్ క్రాస్‌కు అప్పగించారు.


Next Story

Most Viewed