- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీలంక చేరుకున్న ప్రధాని మోడీ

- రక్షణ, వాణిజ్యంపై చర్చలు
- మూడు రోజుల పాటు లంకలో పర్యటన
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన కోసం శ్రీలంక చేరుకున్నారు. థాయిలాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం అనంతరం నేరుగా కొలంబోలో దిగారు. మూడు రోజుల పాటు ప్రధాన మంత్రి మోడీ శ్రీలంకలో పర్యటించనున్నారు. శ్రీలంక రక్షణ, చమురు, డిజిటల్ సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆయా రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయనున్నారు. నిరుడు అధ్యక్షుడు అసుర కుమార దిసనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ అలియన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలి సారి. నిరుడు డిసెంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు ప్రాధాన్యత రంగాల్లో సహకారం అందించుకుంటాయని ఒప్పందం చేసుకున్నాయి.
కాగా, ఈ పర్యటనకు ముందు ప్రధాని మోడీ, అధ్యక్షుడు దిసనాయకే ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సహకారానికి సంబంధించి కొత్త రంగాలను అన్వేషించడానికి ఎదురు చూస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. శ్రీలంక పర్యటనలో ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ద్వీపదేశానికి చౌకైన ఇంధన సరఫరాతోపాటు డిజిటలైజేషన్, ఆరోగ్యం, రక్షణ రంగాల్లో మరింత సహకారానికి భారత్ తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రి కూడా ఉన్నారు.