కోచింగ్ రాకెట్ సైన్సేం కాదు : ఆశిష్ నెహ్రా

by Harish |
కోచింగ్ రాకెట్ సైన్సేం కాదు : ఆశిష్ నెహ్రా
X

దిశ, స్పోర్ట్స్ : కోచింగ్ అనేది రాకెట్ సైన్సేం కాదని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. తాజాగా జియో హాట్‌స్టార్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన నెహ్రా తన కోచింగ్ ఫిలాసఫీ, మైండ్ సెట్ గురించి వివరించాడు. ఐపీఎల్‌ లాంటి దీర్ఘమైన టోర్నీల్లో ఆటగాళ్లకు స్థిరత్వం చాలా ముఖ్యమని తెలిపాడు. ‘ప్రతి మూడేళ్ల తర్వాత జట్టులో 40-50 శాతం మంది కొత్తవాళ్లే ఉంటారు. జట్టును నిర్మించడానికి మళ్లీ అదనపు ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు మా పరిస్థితిలాగా. ఇది కోచ్‌‌కు సవాల్‌గా ఉంటుంది. ఒక వారంలో కొత్త ప్లేయర్లతో సమయం కేటాయించడం, బంధం పెంచుకోవడం అంత ఈజీ కాదు. మైదానంలో, మైదానం వెలుపల వారితో మనం ఎలా ఉంటామన్నదే దానిపై ఆధారపడి ఉంటుంది. కేవలం ప్రాథమిక విషయాలు మాత్రమే. రాకెట్ సైన్స్ ఉందని నేను అనుకోను. కోచింగ్ చాలా సింపుల్ అని నేను ఎప్పుడూ చెబుతాను. చాలా సరళమైన పని. కానీ, ఎల్లప్పుడూ కాదు.’ అని నెహ్రా చెప్పాడు.

అలాగే, గిల్‌ గురించి మాట్లాడుతూ..‘గిల్ వ్యక్తిగత అనుభవం మీద నేర్చుకుంటాడు. కాబట్టి, ఈ సీజన్‌లో ఫలితాలు మెరుగుపడతాయి. ఇది ఫలితాలు గురించి మాత్రమే కాదు. గిల్‌ను జట్టును ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా చూస్తున్నా. ఆట నుంచి ఎప్పుడు నేర్చుకుంటూ, నిలకడగా ఎదిగే గిల్ లాంటి ప్లేయర్లకు ఆకాశమే హద్దు. నేను కూడా ఇదే నమ్ముతా.’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో గుజరాత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీద ఉన్నది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో తలపడనుంది.




Next Story

Most Viewed