రాత్రిపూట చాలాసార్లు నిద్రలేస్తున్నారా? అయితే ఇలా చెక్ పెట్టండి!

by D.Reddy |
రాత్రిపూట చాలాసార్లు నిద్రలేస్తున్నారా? అయితే ఇలా చెక్ పెట్టండి!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది సరిగా నిద్రపోవటం లేదు. ఒక వేళ నిద్రపోయినా కూడా మధ్య మధ్యలో చాలాసార్లు మెలుకుంటూ ఉంటారు. తరచూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకూ కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆరోగ్య నిణుపులు పలు పరిష్కారాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ప్రతి రోజు నిద్రపోయే ముందు ఒత్తిడి కలిగే పనుల గురించి ఆలోచించకూడదని సూచిస్తున్నారు. అలాగే నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని, పడుకోవడానికి ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మీరు లేట్​ నైట్​ డిన్నర్ చేసేవారైతే సాధ్యమైనంత త్వరగా ఆ అలవాటుకు పుల్ స్టాప్ పెట్టాలంటున్నారు. సాధ్యమైనంత వరకు సాయంత్రం 7 గంటల లోపు రాత్రి భోజనం ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా బాగా రాత్రి తర్వాత డిన్నర్ చేస్తే జీర్ణసమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి నిద్రాభంగానికి కారణమవుతాయని అంటున్నారు. ఇంకా చక్కెర, కెఫిన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర డిస్ట్రబ్ అవుతుందని చెబుతున్నారు.

అలాగే, చాలా మంది శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో నిద్ర సరిగా పట్టకపోవడం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చాలా మంది తమ బెడ్ రూంలో వస్తువులను చిందరవందరగా ఉంచుకుంటారు. గది ఇలా ఉండటం వల్ల మనస్సు కూడా చిందరవందరగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ ప్రశాంతమైన నిద్ర దూరం కావడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇలా కాకుండా రాత్రంతా మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎక్కడి వస్తువులు అక్కడ పడేయకుండా నీట్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed